Mon Dec 23 2024 07:15:09 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఏసీబీ పంజా
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గత ఐదు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గత ఐదు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఒక్కొక్కరి వద్ద పెద్దయెత్తున బంగారం, నగదు నిల్వలతో పాటు భారీ ఎత్తున ఆస్తులు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరికి రెండు మూడు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని వారిపై కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
భారీ ఎత్తున నగదు...
కర్నూలు సహాయ రిజిస్ట్రార్ సుజాత ఇంట్లో భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పటమట సబ్ రిజిస్ట్రార్ రాఘవరావు ఇంట్లో కూడా భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. దుర్గగుడిలో సూపరింటెండెంట్ నగేష్ పై రెండు రోజుల నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. నిడదవోలులోనూ ఒక ఇల్లు ఉన్నట్లు ఈ సోదాలు గుర్తించారు. తాడేపల్లి గూడెం, జంగారెడ్డి గూడెంలలో కూడా నగేష్‌కు ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కిలోల కొద్దీ బంగారం...
ఏసీబీ అధికారుల సోదాల్లో అక్రమాస్తులన్నీ బయటపడటంతో నిర్ఘాంతపోవడం ఏసీబీ అధికారుల వంతయింది. ప్రభుత్వ అధికారుల ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వారిని న్యాయస్థానంలో ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కోటి రూపాయల విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లు, నగలు, ఆస్తులను ఎలా సంపాదించారన్న దానిపై ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఒక్కొక్కరి ఇంట్లో రెండు నుంచి మూడు ఖరీదైన కార్లు ఉన్నట్లు గుర్తించారు.
Next Story