Tue Nov 05 2024 16:44:01 GMT+0000 (Coordinated Universal Time)
మార్గదర్శిలో అక్రమాలు నిజమే : సీఐడీ
మార్గదర్శిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని సీఐడీ అడిషనల్ సంజయ్ తెలిపారు
మార్గదర్శిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. ఏ సంస్థ అక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. చిట్ఫండ్ చట్టం 1982 ను మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించిందని తెలిపారు. చిట్ కట్టిన చందాదారుల సొమ్మును దారి మళ్లించడం నేరమేనని, ఆ పనికి మార్గదర్శి యాజమాన్యం ఒడిగట్టిందని సంజయ్ తెలిపారు. సంస్థ మొత్తం మునిగిపోయేంత వరకూ ప్రభుత్వం చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోదని సంజయ్ హెచ్చరించారు.
ఫిర్యాదులు రాకపోయినా...
ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీంకోర్టు శ్రీరామ్ చిట్ ఫండ్స్ కేసులో చెప్పిందని సంజయ్ గుర్తు చేశారు. మార్గదర్శి పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించిందని, తమ సోదాల్లో నిర్ధారణ అయిందని, మనీలాండరింగ్ నిధుల మళ్లింపు కూడా జరిగిందని ఆయన పేర్కొన్నారు. చిట్స్ పేరుతో ఇప్పటి వరకూచూడని అతి పెద్ద ఆర్ధిక మోసాల్లో మార్గదర్శి ఒకటి అని ఆయన తెలిపారు. అమాయకులైన చందాదారులకు దోపిడీ చేయడాన్ని మోసం కింద పరిగణిస్తామన్న సీఐడీ ఏడీజీ మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించి చిట్ఫండ్ చట్టాలను ఉల్లంఘించిందన్నారు.
దారి మళ్లించి...
చందాదారుల చిట్ మొత్తాలను దారి మళ్లించి మార్గదర్శి యాజమాన్యం రహస్యంగా పెట్టుబడులు పెట్టిందన్నారు. అంతేకాకుండా పాడుకున్న చిట్ మొత్తాన్ని అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి తమ వద్దనే ఉంచుకోవాలని చూడటం కూడా నేరంగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. అది చిట్ ఫండ్స్ చట్టాలకు పూర్తి విరుద్ధమని సంజయ్ తెలిపారు. లెక్కలు కూడా మార్గదర్శిలో సరిగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. కనీసం బ్యాలన్స్ షీట్లుకూడా ఫైల్ చేయడం లేదన్నారు. నియంత్రణ సంస్థలకు కూడా అవసరమైన పత్రాలను సమర్పించకపోవడం మోసగించడం కాక మరేమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఈకేసులో ఏ1 నుంచి ఏ5 వరకూ నిందితులను ప్రశ్నించామని, కానీ వారు సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. దీంతో మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని మరింత తేటతెల్లమవుతుందన్నారు.
- Tags
- margadarsi
- cid
Next Story