Mon Dec 23 2024 15:16:27 GMT+0000 (Coordinated Universal Time)
ఒక ఇంట్లో 706, మరో ఇంట్లో 644 ఓట్లు.. మరీ ఇంత నిర్లక్ష్యమా
ఆదోని పట్టణంలోని 17వ వార్డులో న్యూ గాంధీనగర్, అమరావతి నగర్, కల్లు బావి తదిత ప్రాంతాలు 222 పోలింగ్ కేంద్రం పరిధిలోకి
మరికొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడంతో పాటు కొత్తగా ఓటు హక్కు పొందిన వారి జాబితాను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో ఏకంగా 706 ఓట్లు, మరో ఇంట్లో 644 మంది ఓటర్లు ఉన్నట్లు సిబ్బంది ఓటర్ల జాబితా తయారు చేసేశారు. మరి ఇది నిజంగానే నిర్లక్ష్యం కారణంగా జరిగిందా ? లేక దొంగ ఓట్లు చేర్చేందుకు చేసిన పనో తెలీదు గానీ.. ఓట్ల జాబితా తప్పుల తడకగా రూపొందించారు. ఒక ఇంట్లో నాలుగైదు ఓట్లకు మించి ఉండవు. అలాంటిది కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో తప్పుల తడకలా ఓటర్ల జాబితాను రూపొందించి.. సిబ్బంది చేతులు దులిపేసుకోవడం చర్చకు దారితీసింది. ఆ ఓటర్లలో చనిపోయి ఏళ్లు గడిచిన వారి పేర్లు కూడా ఉండటం గమనార్హం.
ఆదోని పట్టణంలోని 17వ వార్డులో న్యూ గాంధీనగర్, అమరావతి నగర్, కల్లు బావి తదిత ప్రాంతాలు 222 పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తాయి. అక్కడ ఇంటి నంబర్ 17లో 644 ఓట్లు, పోలింగ్ స్టేషన్ 223లో ఇంటినంబరు 17/836లో 706 ఓట్లు ఉన్నట్లు ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. ఒకే ఇంటి నంబరుతో వందల కొద్దీ ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. ఒకే వ్యక్తి పేరున 2-3 ఓట్లు నమోదైనట్లు.. సుమారు 10 వేలకు పైగా ఓట్లు ఉండగా.. ఇటీవలే అధికారులు వాటిని గుర్తించి తొలగించారు. అయితే కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం లేని వారి పేర్లు, మరణించి ఏళ్లు గడుస్తున్నా.. వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించకపోవడంతో ఈ తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాను సవరించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినపడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం చనిపోయినవారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండటం.. అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఆదోనిలో ఓటర్ల జాబితాలో తప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఓటర్ల చిరునామా, ఇంటి నంబర్లు సరిగ్గా లేవని సీపీఎం జిల్లా నాయకుడు రాధాకృష్ణ తెలిపారు. చనిపోయిన వారి పేర్లు, పెళ్లిళ్లై వెళ్లిపోయిన వారి పేర్లు కూడా స్థానిక ఓటర్ల జాబితాలో ఉన్నాయన్న ఆయన.. వెంటనే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆదోని తహశీల్దారు వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. జులై 21 నుంచి ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపడుతామన్నారు. నెలరోజుల పాటు ఓటరు జాబితాపై ఇంటింటి సర్వే నిర్వహించి.. బీఎల్ఓల ద్వారా అర్హులైన ఓటర్లను జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఒకే ఇంటి నంబర్ పై అధిక ఓట్లు ఉన్న జాబితాపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామని, చనిపోయినవారి ఓట్లను తొలగించేందుకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
Next Story