Mon Dec 23 2024 16:53:15 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : కేసీఆర్, జగన్ చేసిన తప్పులకు దూరంగా ఉండాలనే లోకేష్ ఈ నిర్ణయం?
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తమ వైఖరిని మార్చుకున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజలను నేరుగా కలిసేందుకు సమయం కేటాయించలేదు. కేసీఆర్ ప్రజాభవన్ కే పరిమితమయిపోగా, జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉండిపోయారు. ఇద్దరూ సచివాలయానికి కూడా వచ్చేవాళ్లు కారు. ఇద్దరూ ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలను నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా కేసీఆర్, జగన్ ల అపాయింట్ మెంట్ లభించేది కాదన్నది అందరికీ తెలిసిందే.
ప్రజా దర్బార్ కు మంచి స్పందన...
అయితే ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి పరిస్థితి రానివ్వకూడదని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నందున ఆ బాధ్యతను యువనేత నారా లోకేష్ చేపట్టారు. ప్రతి రోజూ ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ ప్రజాదర్బార్ ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రజాదర్బార్ కు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. వ్యక్తిగత సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకు వస్తుండటంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని పంపుతున్నారు. అనేక సమస్యలతో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వాటిని కూడా లోకేష్ చెప్పడంతో చిటికెలో అధికారులు సాల్వ్ చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు.
రాష్ట్రం నలుమూలల నుంచి...
అందుకే నలుమూలల నుంచి ఉదయాన్నే అక్కడకు వచ్చిన ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో కలుసుకునే వీలుంది. ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకూ లోకేష్ నేరుగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ఏడు గంటల తర్వాత వచ్చిన వారికి అనుమతి లేదని ముందుగానే చెబుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి రాత్రికే విజయవాడకు చేరుకుని ఉదయం ఆరు గంటలలోపే ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోవాల్సి ఉంటుంది. పిటీషన్లు తాము లోకేష్ కు ఇస్తే వెంటనే పరిష్కారం అవుతుండటంతో ప్రజా దర్బార్ కు మాత్రం మంచి స్పందన లభిస్తుందని చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు కూడా...
మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో ఇబ్బందులు, సమస్యలను చెప్పుకోవడానికి లోకేష్ వద్దకు క్యూ కడుతున్నారు. తమ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలతోపాటు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేసేందుకు నిధులు విడుదల చేసేందుకు సంబంధిత మంత్రులకు తెలియజేయాలని లోకేష్ కు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు. దీంతో చంద్రబాబును కలవకపోయినా లోకేష్ అందుబాటులో ఉండటంతో ఎమ్మెల్యేలు తమ బాధలను చెప్పుకునే వీలుకల్పిస్తూ లోకేష్ ప్రతి రోజూ ఎమ్మెల్యేల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు లోకేష్ అంతా తానే అయి వ్యవహరిస్తుండటంతో పార్టీ నేతల్లోనూ కొంత సానుకూలత వ్యక్తమవుతుంది.
Next Story