Mon Dec 23 2024 04:12:58 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఒకే కుటుంబం నుంచి ఐదుగురు గెలుపు.. రికార్డు బ్రేక్ చేసిన నందమూరి ఫ్యామిలీ
ఎన్టీఆర్ కుటుంబంలో పోటీ చేసిన వారందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఎన్టీఆర్ కుటుంబంలో పోటీ చేసిన వారందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేయగా అందరూ గెలుపు బాటపట్టారు. పార్లమెంటుకు ఇద్దరు, అసెంబ్లీకి ముగ్గురు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇది ఒక అరుదైన చరిత్రగా పేర్కొనాలి. ఒకే ఫ్యామిలీ కి చెందిన ఐదుగురు చట్టసభల్లో ఒకే ఎన్నికల్లో గెలిచి అడుగు పెట్టడం కూడా రికార్డుగానే పేర్కొనాలి. పోటీ చేసిన వారందరూ భారీ విజయాన్ని అందుకున్నారు.
శాసనభకు ముగ్గురు...
కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పార్టీ అధినేతగా ఆయన విజయం సాధించారు. ఇక నారా లోకేష్ మంగళగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయినా అక్కడి నుంచే మళ్లీ బరిలో నిలిచి ఈసారి ఎన్నికయ్యారు. మంగళగిరిలో రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పార్లమెంటుకు ఇద్దరు...
ఇక ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి ఆమె పదేళ్ల తర్వాత గెలుపు రుచిని చవి చూశారు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన పురంద్రీశ్వరి ఈసారి రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ఇక నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ విశాఖ లోక్సభ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓటమిపాలయిన శ్రీభరత్ ఈసారి గెలిచి పార్లమెంటులో తొలిసారి అడుగుపెడుతున్నారు. ఇలా ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకేసారి ఐదుగురు గెలవడం రికార్డు అని చెప్పాలి.
Next Story