Mon Dec 23 2024 14:26:38 GMT+0000 (Coordinated Universal Time)
Bhuma Akhila Priya : భూమా వారి రెడ్ బుక్.. ప్రత్యర్థులను వదిలేదే లేదట
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన వద్ద కూడా ఒక రెడ్ బుక్ ఉందని, అందులో చాలా మంది చెడ్డోళ్ల పేర్లున్నాయని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. తాను ఎవరినీ వదలబోనని స్పష్టం చేశారు. నేనసలే ఊరుకునే దానిని కాదన్నారు. వారు అధికారంలో ఉండగా తమ వారిపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, ఇప్పుడు వదులుతానని ఎలా అనుకున్నారని ఆమె ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎవరినీ వదిలి పెట్బబోమని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చింది తన రాజకీయ ప్రత్యర్థులైన గంగుల కుటుంబంతోనూ, టీడీపీలోనే ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైరం ఉంది.
గంగుల కుటుంబంతో...
ఎవరిని ఉద్దేశించి అఖిలప్రియ ఆ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి, గంగుల ఫ్యామిలీకి మధ్య సుదీర్ఘకాలం వైరం ఉంది. 2019 ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి గెలుపొందారు. గంగుల కుటుంబంతో ఆమె ఐదేళ్ల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టారని ఆమె ఆరోపిస్తూ అనేక సార్లు ఆందోళనకు కూడా దిగారు. దీంతో గంగుల కుటుంబం మీద రివెంజ్ తీర్చుకోవడానికి భూమా అఖిలప్రియ రెడీ అయినట్లుగానే కనిపిస్తుంది. అందుకే ఈ వార్నింగ్ ఇచ్చారంటున్నారు కొందరు.
ఏవీ సుబ్బారెడ్డి తో వైరం...
మరికొందరు మాత్రం గంగుల కుటుంబం మాత్రమే కాదు. ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం పై కూడా అఖిలప్రియ గుర్రుగా ఉంది. అనేకసార్లు దాడులు కూడా ఒకరిపై ఒకరు చేసుకున్నారు. అనేక సార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి టీడీపీలోనే ఉన్నారు. ఆయన తన పార్టీలోనే ఉన్నా, తన తండ్రికి అత్యంత సన్నిహితుడైనా ఏవీ సుబ్బారెడ్డిని శత్రువుగానే పరిగణిస్తూ వచ్చారు. నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తుల వివాదమే ఈ విభేదాలకు కారణమని చెబుతుంటారు. అందుకే ఏవీ సుబ్బారెడ్డితో నిత్యం అమితుమీ తేల్చుకునేందుకు భూమా అఖిలప్రియ సిద్ధమవుతున్నారని చెప్పకనే తెలుస్తుంది.
సయోధ్యకు ప్రయత్నించినా...
అయినా ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. టీడీపీ నాయకత్వానికి ఇద్దరూ దగ్గరే. ఏవీ సుబ్బారెడ్డి కూడా గత ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డలో తాను అఖిల ప్రియను ఓడిస్తానని బహిరంగంగానే సవాల్ విసిరారు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి పై అఖిలప్రియ అనుచరులు దాడులు చేశారు. ఇరువర్గాలకు పార్టీ అధినాయకత్వం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సయోధ్య మాత్రం సాధ్యపడలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రకటనతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరించే ప్రయత్నాన్ని అఖిలప్రియ చేస్తున్నారంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story