Wed Dec 18 2024 14:15:17 GMT+0000 (Coordinated Universal Time)
Alla Nani : వైసీపీ నేత ఆళ్ల నాని రాజీనామాకు కారణాలివేనా? వ్యక్తిగత రీజన్ కాదా?
మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
మాజీ మంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ కు లేఖ పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన తన లేఖలో కోరారు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఆళ్లనాని రాజీనామా చేయడం వైసీపీకి షాక్ అని తెలపాలి. ఒకరకంగా జగన్ కు ఆళ్ల నాని కష్ట సమయంలో ఇబ్బంది పెట్టాడనే అనుకోవాలి.
వ్యక్తిగత కారణమంటున్నా....
ఆళ్ల నాని రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నా ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆళ్ల నాని రాజీనామా చేయడానికి కారణాలు పైకి చెబుతున్నవి కావని తెలిసింది. ఆయనది రాజకీయాల్లో చూస్తే పెద్ద వయసు కూడా కాదు. చిన్న వయసులోనే ఆయనకు ఈ వైరాగ్యం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వస్తున్నాయి. వైఎస్ జగన్ ఆళ్ల నానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఓటమి పాలయినప్పుడు కూడా ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
తొలి మంత్రివర్గంలోనే...
వైసీపీ అధికారంలోకి రాగానే తొలి మంత్రి వర్గంలోనే వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలకమైన మంత్రిత్వ శాఖను అప్పగించారు.డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. అయితే రెండో సారి మంత్రి వర్గ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటి నుంచే ఆళ్ల నాని అసంతృప్తితో ఉన్నారు. అస్సలు నియోజకవర్గంలో ఆళ్ల నాని పెద్దగా తిరగరన్న ప్రచారం కూడా ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరిగినప్పుడు ఆళ్ల నాని ఏలూరు వాసులకు దూరంగా ఉన్నారు. ఏలూరు నియోజకవర్గంలో మూడు సార్లు ఆళ్ల నాని గెలిచినా ఆయన ప్రజలకు చేరువ కాలేకపోయారు.
ప్రజల్లోకి వెళ్లలేక...
సామాజికవర్గంతో పాటు ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న ఆళ్లనాని బద్దకస్తుడు అంటారు. ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడరు. ప్రజలను కలుసుకునేందుకు కూడా ఆయన విముఖంగా ఉంటరు. తనకు ఈ రాజకీయాలు పడవని మొన్నటి ఎన్నికల తర్వాత డిసైడ్ అయ్యారు. పాతకాలం నాటి రాజకీయాలు కావు. ఇప్పుడు జనంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. లేదంటే లేదు. అంతే తప్ప తాను పాతతరం నాయకుల్లాగా బంగ్లాలో కూర్చుని రాజకీయాలు చేద్దామంటే కుదరదు. రాజకీయాల్లో ఓపిక లేకనే ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story