Fri Apr 18 2025 04:59:47 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : అమరావతి పనులు ఇక షురూ... వేగంగా భవనాల నిర్మాణం
అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. శాశ్వత నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది

అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. శాశ్వత నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం అంతే వేగంగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమయింది. ముఖ్యంగా అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం కోసం తాజాగా టెండర్లను పిలిచింది. 1,048 హైకోర్టును కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. అసెంబ్లీని 748 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు టెండర్లు పిలవడంతో ఏ సంస్థ తక్కువగా కోట్ చేస్తుందో దానికి నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందుకోసం సీఆర్డీఏ అధికారులు టెండర్లను ఈ నెలలోనే ఖరారు చేయనున్నారు.
టెండర్లు ఖరారయిన తర్వాత...
టెండర్లకు ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం వరకూ గడువు విధించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్ వేరు వేరుగా వేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సి వస్తుండటంతో తుపానులకు, వరదనీటికి తట్టుకునేలా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ భవనాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలోనే కొన్ని డిజైన్లను సిద్ధం చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది. 2018 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన అంచనాల కంటే ఇప్పుడు ఎక్కువ కవడంతో పాటు అదే డిజైన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
103 ఎకరాల్లో...
అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్థులు ఉండేలా నిర్మాణ పనులు సాగనున్నాయి. ఇందులోనే మంత్రులు ఛాంబర్లతో పాటు కౌన్సిల్ కూడా ఉంటాయి. మూడో అంతస్థు నుంచి నగరాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు భవనాన్ని 42 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఏడు అంతస్థుల్లో హైకోర్టు భవనాన్ని నిర్మించనున్నారు. లైబ్రరీతో పాటు డైనింగ్ హాలు కూడా ఈ నిర్మాణంలో చోటు చేసుకోనున్నాయి. ముందుగా ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతికి ఒక రూపు రేఖలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వేగంగా హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story