Mon Dec 23 2024 05:19:47 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. ఏకంగా ఢిల్లీకి వెళ్తానంటున్న అంబటి
కాపురం చేస్తూనే మరో అమ్మాయితో బంధం నెరపడం వల్ల మొదటి పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పారు. మొదటి భార్యతో సెటిల్మెంట్
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాపై ఆంధ్రప్రదేశ్ లో వివాదం కొనసాగుతోంది. తనను కించపరిచేలా సినిమాలో చూపించారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్రో సినిమా లావాదేవీలలో మనీలాండరింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు. అమెరికా నుంచి ఈ సినిమా నిర్మాతకు డబ్బులు వచ్చాయని, నిర్మాత ద్వారా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు డబ్బులు ఇప్పించారని అన్నారు. బ్లాక్ మనీ, మనీలాండరింగ్ వ్యవహారం జరిగిందని, దీనిపై విచారణ జరిగేలా కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నానని అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.
బ్రో సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నామని.. బుధవారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి చెప్పారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలతో పాటు వెళ్లి దర్యాప్తు సంస్థలను కలుస్తానని అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ పై తాను కూడా సినిమా తీయనున్నట్లు మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తాము తీయబోయే సినిమా కథకు సంబంధించిన లైన్ ను కూడా మంత్రి రాంబాబు వివరించారు. ఓ మంచి నేపథ్యం ఉన్న కుటుంబంలో అన్నదమ్ములు అందరూ ఓ రంగంలో మంచి పేరుప్రఖ్యాతులు సాధిస్తారు. అదే కుటుంబంలో పుట్టిన చిన్నవాడికి మాత్రం చదువు అబ్బదని, బలాదూర్ గా తిరుగుతుంటాడని చెప్పారు. అక్కడక్కడా తప్పిపోతూ, అక్కడక్కడా దొరికిపోతూ ఉంటాడని వివరించారు. చిన్నోడికి చదువు అబ్బదని తెలిసి తల్లిదండ్రులు వాడిని అన్నయ్యల దగ్గర పెడితే.. అన్నయ్యల దగ్గర కూడా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తాడని వివరించారు. నేను అన్నయ్యల దగ్గరుండను, అన్నల్లో కలిసిపోతాను, రౌడీయిజం చేస్తాను, అక్కడా ఇక్కడా గోకుతాను అంటూ చిల్లర పనులు చేస్తుంటే అన్ని రంగాల్లో విఫలమైన చిన్నవాడిని అన్నయ్యలు చివరకు తమ రంగంలోకి తీసుకొస్తారని అన్నారు.ఇక్కడ అనూహ్యంగా ఎదిగిన చిన్నవాడు.. అన్నయ్యలకంటే కూడా ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడని మంత్రి వివరించారు. పెద్ద సెలబ్రిటీగా మారడంతో చిన్నవాడు ఎక్కడికి వెళ్లినా జనం ఈలలు వేస్తూ జేజేలు కొడుతుంటారని అన్నారు. దేశం గురించి, సమాజం గురించి, సమానత్వం గురించి, మానవత్వం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటాడని పేర్కొన్నారు. మేడి పండు చందంలో ఈ నయా సెలబ్రిటీ వ్యక్తిగత జీవితం నిండా పురుగులేనని మంత్రి అంబటి అన్నారు. యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి చేస్తే పట్టుమని రెండేళ్లు కూడా ఆ వివాహం నిలబెట్టుకోడని.. ఓవైపు భార్యతో కాపురం చేస్తూనే మరో అమ్మాయితో బంధం నెరపడం వల్ల మొదటి పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పారు. మొదటి భార్యతో సెటిల్మెంట్ చేసుకుని విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటాడని తెలిపారు. కథలో ఇక్కడే ట్విస్టు ఉంటుందని, మొదటి భార్యకు ఏం జరిగిందో రెండో భార్యకు కూడా అదే జరుగుతుందని, ఆ తర్వాత మూడో భార్యకు, నాలుగో భార్యకు.. ఇలా కథ కొనసాగుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
బ్రో చిత్రంలో శ్యాంబాబు పాత్ర ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేయడానికి సృష్టించారని కామెంట్లు వినిపించాయి. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్రను తిట్టడం ద్వారా, పవన్ గతంలో అంబటి చేసిన నృత్యాలను పరోక్షంగా విమర్శించారు. అప్పటి నుండి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లలో బ్రో సినిమా మీదా.. పవన్ కళ్యాణ్ మీదా ఫైర్ అవుతూ ఉన్నారు.
Next Story