Mon Dec 16 2024 03:00:17 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మరో రుయా తరహా ఘటన.. వీడియో పోస్ట్ చేసిన లోకేష్ !
మీపై కుళ్లు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మ సంతృప్తి కలగొచ్చు..
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యవస్థ సరిగ్గా లేదనేందుకు ఇటీవల జరుగుతున్న ఘటనలు అద్దం పడుతున్నాయి. ఆడపిల్లలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అంబులెన్సుల మాఫియాలు ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇటీవల రుయా ఆస్పత్రిలో చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తండ్రి బైకుపై తీసుకెళ్లగా.. వారంరోజుల వ్యవధిలోనే నిన్న నెల్లూరు జిల్లా సంగం ఆస్పత్రిలో మరో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది నిరాకరించింది. దాంతో.. తండ్రి కొడుకు మృతదేహాన్ని బైకుపైనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
ఈ రెండు ఘటనలు మరువక ముందే.. మరో ఘటన వెలుగులోకొచ్చింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లిలో గ్రావెల్ గుంతలో పడి అక్షయ అనే రెండేళ్ల పాప మృతి చెందింది. ఆస్పత్రి నుంచి రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు 108 సిబ్బంది, మరోవైపు ఆటోడ్రైవర్లు కూడా నిరాకరించడంతో బైక్‌పైనే ఆ పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ నేత నారా లోకేశ్ పోస్ట్ చేసి.. ఇలా రాశారు.
''మీపై కుళ్లు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మ సంతృప్తి కలగొచ్చు ఏమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు. మీరు మాపై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్లాడు ఓ తండ్రి. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్ పై సొంత గ్రామం కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి'' అని నారా లోకేశ్ విమర్శించారు.
Next Story