Fri Nov 22 2024 20:06:54 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ఊరేగింపుతో ట్రాఫిక్ నిలిపివేత.. 8 నెలల చిన్నారి మృతి
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్ - ఈరక్క దంపతులకు 8 నెలల క్రితం..
కల్యాణదుర్గం : ఏపీలో ఇటీవల మంత్రివర్గ పునర్య్వవస్థీకరణ చేసిన విషయం తెలిసిందే. కొత్తమంత్రివర్గంలో చోటు సంపాదించిన ఉషా శ్రీచరణ్.. ప్రమాణ స్వీకారం అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. మంత్రి ఊరేగింపు నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. అదే సమయంలో అస్వస్థతకు గురైన 8 నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. మంత్రి ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ నిలిపివేయడంతో.. చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగింది.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేశ్ - ఈరక్క దంపతులకు 8 నెలల క్రితం పాప పుట్టింది. నిన్నసాయంత్రం చిన్నారి ఉన్నట్లుండి అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే వారు ఆటోలో చిన్నారితో కల్యాణదుర్గం బయల్దేరారు. అదే సమయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ పట్టణానికి వస్తుండడంతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో చిన్నారితో వెళ్తున్న ఆటో పట్టణ శివారులో చిక్కుకుపోయింది. ఆలస్యం అవుతుండడంతో తెలిసినవారి బైక్‌పై చిన్నారిని తీసుకుని బయలుదేరారు. 15 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేరుకున్నారు.
కానీ.. అప్పటికే పాప చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. పాప మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ట్రాఫిక్ నిలిపివేయకుండా ఉండి ఉంటే.. తమ కుమార్తె బతికేదని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తాము ఎవరినీ అడ్డుకోలేదని వివరణ ఇచ్చారు. చిన్నారి అస్వస్థతకు గురైందని తెలియగానే వెంటనే వారిని పంపించామని చెప్పారు.
Next Story