Tue Dec 24 2024 13:26:50 GMT+0000 (Coordinated Universal Time)
లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్.. తీసుకున్న నిర్ణయాలు ఇవే!
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పరంగా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
రాష్ట్రంలో పోర్టుల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే! వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పరంగా దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్‌గా అవతరించింది. సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్‌లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇక రాష్ట్రంలోని పోర్టులను సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి ‘లాజిస్టిక్స్ హబ్’గా ఏపీ మారుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్ కమల్ బాలి కూడా తెలిపారు. ‘సేవా రంగం పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ నగరాలు ‘సర్వీసెస్ హబ్‌లు’గా మారేందుకు అవకాశముంది. వాటిని అభివృద్ధి చేస్తే బెంగళూరు, చెన్నై తదితర పెద్ద నగరాలతో పోటీ పడతాయని అన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ‘జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం’ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఎగుమతులను రెట్టింపు చేసేలా ‘పుష్’ (పీయూఎస్‌హెచ్) విధానాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉత్పత్తులకు మరింత విలువను జోడించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించనున్నారు(ప్రమోట్–పీ). జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. ఎగుమతులకు కీలకమైన ఓడ రేవులు, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు లాంటి కీలక మౌలిక వసతులను అభివృద్ధి (అప్‌గ్రేడ్–యూ) చేయనున్నారు. 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లతో పాటు విశాఖ, అనంతపురంలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. ఎగుమతుల విధానాన్ని స్ట్రీమ్‌లైన్ (ఎస్) చేస్తూ నూతన టెక్నాలజీ వినియోగం ద్వారా (హార్నెస్–హెచ్) ఎగుమతులను ప్రోత్సహించనున్నారు.
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆరు కీలక అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎగుమతుల సమాచారమంతా ఒకేచోట లభించే విధంగా డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగిస్తున్నారు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, లాజిస్టిక్ హబ్, ఎయిర్‌పోర్టులు, పోర్టు, రహదారుల అనుసంధానం లాంటి వాటిపై భారీగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకోగా.. అందుకు సంబంధించి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రతి జిల్లాను ఎక్స్పోర్ట్ హబ్‌గా తీర్చిదిద్ది ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేశారు. నాణ్యతా పరమైన కారణాలతో ఎగుమతులు తిరస్కరణకు గురి కాకుండా క్వాలిటీ టెస్టింగ్ కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయనున్నారు.
Next Story