Mon Apr 21 2025 05:23:13 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : వాలంటీర్లకు నేడు గుడ్ న్యూస్ అందబోతుందా? కీలక నిర్ణయం వెలువడనుందా?
నేడు జరిగే ఏపీ మంత్రి వర్గ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది

వాలంటీర్ల వ్యవస్థపై నేడు మంత్రి వర్గ సమావేశంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. నేడు జరిగే ఏపీ మంత్రి వర్గ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించింది. వారు ఆ ఇళ్లకు సంబంధించిన అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వారికి అవసరమైన సర్టిఫికేట్లతో పాటు అనేక విషయాల్లో చేదోడుగా నిలిచింది. దాదాపు రెండులక్షల మందికి పైగానే ఉన్న వాలంటీర్ల వ్యవస్థతో గత ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనిలేకుండా వాళ్లే పనులు చేసి పెడుతున్నారు.
గత ప్రభుత్వం నియమించిన...
అయితే గత ప్రభుత్వం వాలంటీర్లను కేవలం సేవకులుగానే భావించిన గత ప్రభుత్వం వారికి నెలకు ఐదు వేల రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తూ వచ్చింది. అయితే ఎన్నికల సమయంలో వారు ప్రభావం చూపుతారని భావించి ఎన్నికల కమిషన్ వారిని పక్కన పెట్టింది. కూటమి పార్టీకిచెందిన నేతలు ఎన్నికలకు ముందు వాలంటీర్లందరికీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అంతేకాకుండా నెలకు పది వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నుంచి పవన్ కల్యాణ్ వరకూ ఇదే రకమైన ప్రకటన చేశారు. కొందరు వాలంటీర్లు గత ఎన్నికలకు ముందు తమ పోస్టులకు రాజీనామాలు చేసినా ఎక్కువ మంది మాత్రం ఆ పనిచేయలేదు.
పదినెలలు గడుస్తున్నా...
కానీ కొత్త ప్రభుత్వం వచ్చి పదినెలలు గడుస్తున్నా వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయింది. వారిని కొనసాగించాలా? లేదా? అన్న నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోయింది. గత పది నెలల నుంచి పింఛన్లను సచివాలయం సిబ్బందితో పాటుగా రెవెన్యూ శాఖకు చెందిన వారితో ఇంటింటికి పింఛను పంపిణీ సక్సెస్ ఫుల్ గా చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థ లేని లోటు లేకుండా పింఛన్ల పంపిణీ చేస్తుండటంతో పాటు వారికి ఇప్పటి వరకూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. వారు చట్టబద్దంగా నియమితులైన వారు కాదని కూడా కూటమి నేతలు పదే పదే చెబుతుండటంతో వాలంటీర్ల వ్యవస్థకు ఇక కాలం చెల్లినట్లేనని భావించారు. వారు అనేక రకమైన ఆందోళనలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇంకా డైలమాలోనే...
ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా? లేదా? అన్నది ఇంకా ప్రభుత్వం తేల్చుకోలేదు. ఇంకా డైలమాలోనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని కొందరు కూటమి నేతలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు మాత్రం ఈ వ్యవస్థ వల్ల ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెబుతున్నారు. అందుకే దీనిపై నేడు మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికిప్పుడు వాలంటీర్ల వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ చర్చ జరిపి అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story