Mon Dec 23 2024 07:02:28 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh Welfare Schemes : దసరాకు చంద్రబాబు గుడ్ న్యూస్.. మహిళలకు "ఫ్రీ" బస్సు ప్రకటన సిద్ధం
ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఎంతగా అంటే పది లక్షల కోట్ల రూపాయలంటూ గత ప్రభుత్వం చేసిన అప్పుల విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పదే పదే గుర్తు చేస్తోంది. ఇక కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అప్పులు తెస్తూనే ఉంది. ఆదాయం తగ్గింది. ఖర్చులు పెరిగాయి. మరోవైపు సూపర్ సిక్స్ హామీలపై జనం ఎదురు చూస్తున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విపక్ష వైసీపీ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తుంది.
ఖజానా ఖాళీ అంటూ...
అయినా చంద్రబాబు తొణకడం లేదు. బెణకడం లేదు. ఏ సమావేశంలోనైనా ఆయన ఒకటే చెబుతున్నారు. ఖజానా ఖాళీగా ఉందని. మంత్రులు కూడా ఇదే మాట చెబుతున్నారు. కానీ అలాగని ఊరుకోవడం లేదు. వరసగా ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వెళుతున్నారు. పింఛను అయితే మొదటి నెల నుంచే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పర్చారు. అలాగే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై కూడా తొలి సంతకం పెట్టారు. ఇక దీపావళి నాటికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నిన్న గాంధీ జయంతి రోజున చెత్త పన్నును తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండగ రోజు పేదరికం పోగొట్టేందుకు P-4 ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లుప్రకటించారు.
మంత్రి వర్గ సమావేశంలో...
ఇక తాజాగా ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది. చంద్రబాబు ముఖ్యంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఇప్పటికే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇంకా దానిని అమలు పర్చలేకపోయారు. ఇది కొంత విమర్శలకు దారి తీస్తుంది. అయితే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కర్ణాటక, తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. దీంతో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దసరా నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, చంద్రబాబు ప్రకటించే అవకాశాలున్నాయని అధికారికవర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
మహిళలకు ఉచిత ప్రయాణం...
అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం లేకపోయినా విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోవాలంటే వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే మేలన్న అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని అంటున్నారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత పండగకు ముందు అత్యవసరంగా కేబినెట్ భేటీ ఏర్పాటుచేయడంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడానికేనని అంటున్నారు. మహిళలు ప్రభుత్వంపై అసంతృప్తికి లోనుకాకుండా దసరా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో?
Next Story