Fri Mar 28 2025 04:13:04 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు వైఫల్యాన్ని కూడా అంగీకరించారంటే ఇంక అంతా మంచిరోజులేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయన హుందాగా ఓటములకు తానే కారణమని అంగీకరించడం పార్టీలో శుభపరిణామని చెప్పాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో ఏ అగ్రనేత ఈ స్థాయిలో బహిరంగంగా ప్రకటించారు. శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటమికి గల కారణాలను తెలిపారు. తన వ్యవహారశైలి కారణంగానే 2004, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని ఒప్పుకున్నారు. అంతే కాదు ఎమ్మెల్సీలను, క్యాడర్ ను సమన్వయం చేసుకోవడంలో పార్టీ నేతగా తాను విఫలమయ్యానని కూడా అంగీకరించారు. నిజానికి చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించనూ లేదు.
గెలిస్తే తామేనంటూ...
ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో అగ్ర నేతలు ఎవరూ గెలుపుకు తమ ఫొటో కారణమని చెప్పుకుంటారు తప్పించి ఓటమిని తాము హుందాగా తీసుకోరు. ఓటమికి అనేక కారణాలు వెతుక్కుంటారు. చంద్రబాబు నాయుడు కూడా 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ఈవీఎంల విషయంలో ఉన్న లోటు పాట్లను ప్రస్తావించారు. మొన్న జరిగిన ఎన్నికలలో ఓటమి పాలయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా తన పార్టీ ఓటమికి కారణం ఈవీఎంలేనని, తిరిగి బ్యాలట్ విధానాన్ని తీసుకు రావాలంటూ గట్టిగానే కోరారు. అంటే గెలుపును తమ ఖాతాలో వేసుకున్నంత సులువుగా ఓటమిని తమ అకౌంట్లోకి వేసుకునేందుకు ఏ అగ్ర నేత ఇష్టపడరన్నది అందరికీ తెలిసిందే.
ఓటమికి తానే కారణమని...
కానీ చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చిందనడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే 2004, 2019 లో ఓటమికి తానే కారణమని ఆయన ఒప్పుకున్నారు. కేవలం అధికారుల మధ్యనే ఉంటూ వారి ఫీడ్ బ్యాక్ మీదనే ఆధారపడుతూ పాలన సాగించడంతోనే ఓటమి పాలయ్యానంటూ పరోక్షంగా చంద్రబాబు అంగీకరించినట్లయింది. నిజంగా చంద్రబాబు పెద్దమనసు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ అని చెప్పాలి. ఆయన ఈ టర్మ్ లో కొంత తీరును మార్చుకోనున్నట్లు కూడా ఈ స్టేట్ మెంట్ తో అర్థమవుతుంది. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వెళ్లడంతో పాటు కార్యకర్తలను కాపాడుకోవడంతోనే గెలుపునకు సులువైన మార్గమని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.
నాలుగేళ్ల కాలంలో...
అందుకే రానున్న నాలుగేళ్ల కాలంలోనూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన తరచూ కలవాలని నిర్ణయించుకున్నారు. అలాగే నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. 2029 ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే ఆయన సన్నద్ధం చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఆయన ముందుకు వెళుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ఓటమికి తానే కారణమని అంగీకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరన్నది ఆయన మాటలను బట్టి స్పష్టమవుతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరిగి జయకేతనం ఎగురవేసేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది.
Next Story