Mon Dec 23 2024 20:10:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala Laddu Controversy : చంద్రబాబు కొత్త స్ట్రాటజీ.. పవన్ కూడా తోడయ్యారుగా.. ఇక జగన్ కు సినిమానేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త స్ట్రాటజీకి తెరతీశారు. జగన్ దెబ్బతీయడానికి పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త స్ట్రాటజీకి తెరతీశారు. జగన్ అక్రమాస్తులపై ఎంత విమర్శలు చేసినా ఫలితం లేదు. అవి న్యాయస్థానాల్లో ఏళ్లుగా నలుగుతూనే ఉన్నాయి. మరోవైపు జనం కూడా నమ్మడం లేదు. అవినీతి అంటే ప్రజలు కూడా సాధారణంగానే చూడటం పరిపాటిగా మారింది. ఈ విషయాన్ని చంద్రబాబు పసిగట్టినట్లుంది. అందుకే చంద్రబాబు ఇప్పుడు హిందువల సెంటిమెంట్‌ను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కమలం పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది ఈ కోణంలోనే. అదే వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు కనపడుతుంది. దీంతో వైఎస్ జగన్ ఇక రాజకీయంగా కోలుకోలేరన్నది విశ్లేషకుల అంచనా.
లడ్డూ వివాదాన్ని...
ఎందుకంటే తిరుమల లడ్డూ వివాదాన్ని వదిలిపెట్టకుండా ఆయన దాని వెంట పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. తిరుమల, సింహాచలం, అన్నవరం ఇలా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ జరిపి గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయని, తప్పులు జరిగాయనే భావన ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్‌తో జనాలను సులువుగా లాక్ చేయవచ్చు. అలాగే భక్తితో కూడా ప్రజలను సులువుగా ఒకరిపై ద్వేషం తెప్పించవచ్చు. మరొకరిపై ప్రేమను కూడా కురపించవచ్చు. జాతీయ స్థాయిలో హిందువుల మనోభావాలంటూ బీజేపీ ఎలా ఎదిగిందో.. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను క్షేత్రస్థాయిలో దెబ్బతీయాలంటే ఆలయాలే ప్రధానమన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు కనపడుతుంది.
ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో...
అందుకే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ విధానాన్ని పెద్దది చేశారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం వేశారు. తిరుమల ఆలయంలో అపవిత్రతత జరిగిపోయిందన్న కలరింగ్ బాగానే ఇచ్చారు. దీనికి మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ కూడా సహకరిస్తున్నారు. మరో మిత్ర పక్షం బీజేపీ పెద్దగా స్పందించకపోయినా పవన్ కల్యాణ్ మాత్రం ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో రోజూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఈ లడ్డూ వివాదం లైవ్ లో ఉండేలా చూస్తూ చంద్రబాబుకు నేరుగా సహకరిస్తున్నారు. ఈరోజు దుర్గగుడి మెట్లను శుభ్రం చేయడమే కాకుండా వైసీపీ నేతలకు దుర్గగుడి నుంచే వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్‌లు మాత్రం వైసీపీని రాజకీయంగా వెనక్కు నెట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నట్లు కనపడుతుంది.
డిక్లరేషన్ ఇవ్వకుండా...
మరోవైపు చంద్రబాబు ఎక్స్ లో కూడా కొద్ది సేపటి క్రితం చేసిన ట్వీట్ కూడా జగన్ ను ఇరకాటంలోకి నెట్టేది లా ఉంది. తిరుమలకు వెళ్లిన జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇతర మతస్థులు తిరుమలకు వెళ్లవచ్చని, వారు వెళితే స్వామివారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి జగన్‌కు తెలియదా? అని చంద్రబాబు జగన్ నిలదీశారు. సంప్రదాయాన్ని జగన్ తుంగలో కుక్కి జగన్ తిరుమల పవిత్రను కాలరాశారంటూ చంద్రబాబు మండిపడ్డారు. సంప్రదాయాలను గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల కూడా జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. మొత్తం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలసి జగన్ ను కోలుకోకుండా చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనపడుతుంది.
Next Story