Sat Jan 11 2025 10:44:42 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : 1995 నాటి చంద్రబాబు అవుతారా? నో నెవ్వర్ అంటున్న క్యాడర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాట తనలో 1995 ముఖ్యమంత్రిని చూస్తారని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్న మాట తనలో 1995 ముఖ్యమంత్రిని చూస్తారని. ఆయన తరచూ ఈ వ్యాఖ్యలు చేస్తుండటంతో నాడు ఆయన ఎలా ఉండేవారని ఇప్పటి జనరేషన్ సహజంగా అనుకుంటుంది. 1995లో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించినప్పుడు ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారు. నాడు తాను చీఫ్ మినిస్టర్ ను కాదని రాష్ట్రానికి సీఈవో అని తనకు తానే ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని తీసుకున్న చంద్రబాబు ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని నడపటంలో 1995లోనే అడుగులు పడ్డాయి. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇక ఏమాత్రం బ్రేకులు పడలేదు.
నాలుగుసార్లు పనిచేసి...
ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారు. పార్టీ అధికారంలోకి రాలేనిసమయంలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమర్థవంతమైన పాత్రను ఆయన పోషించారు. ఇప్పుడు 2025లో ఉన్నాం. అంటూ ముప్ఫయి ఏళ్లకు వెనక్కు వెళితే.. ఆయనేంటో అందరికీ తెలుసు. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపేవారు. నిత్యం సమీక్షలు నిర్వహించేవారు. నాడు హైదరాబాద్ సచివాలయంలో రాత్రి 9 గంటల వరకూ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేవారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళుతూ దారి మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ పార్టీ నేతలతో భేటీ అయి గంట సేపు వారికి దిశానిర్దేశం చేసేవారు.
పార్టీకి సమయం....
కానీ ఇప్పుడు పార్టీకి కేటాయించే సమయం తక్కువగానే ఉంటుంది. అదే సమయంలో సమీక్షలను మాత్రం శాఖల వారీగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఆకస్మిక తనిఖీలను కూడా విస్తృతంగా చేసేవారు. చంద్రబాబు ఆకస్మిక పర్యటనలకు వచ్చారంటే ఎవరో ఒకరు సస్పెండ్ అయ్యే వారు. అందుకే అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేసేవారు. ఇప్పుడు ఏడు నెలలు గడుస్తున్నా చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు చేయడం లేదు. ఇక మరొక కీలకమైన అంశం. మంత్రులు. మంత్రుల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏమాత్రం తోక జాడించారని తెలిసినా వెంటనే యాక్షన్ లోకి దిగేవారు. నాడు న్యూస్ ఛానల్స్ లేవు. కేవలం పత్రికలు మాత్రమే. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా చర్యలు తీసుకునే వారు.
మంత్రులను తొలగించి...
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు నుంచి నాడు ఒక అవినీతి కథనం ఒక ప్రధాన పత్రికలో ప్రచురితమైంది. అయితే అందుకు బాధ్యులైన నాటి మంత్రి పోచారం శ్రీనివాసులురెడ్డిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించి సంచలనమే సృష్టించారు. కానీ నేడు మంత్రుల జోలికి వెళ్లాలన్నాచంద్రబాబు నాటి దూకుడు ప్రదర్శించలేకపోతున్నారని ఆయనను దగ్గర నుంచి తెలిసిన వ్యక్తులు అనుకోవడం సహజం. ఎందుకంటే ఇన్ని ఘటనలు జరిగినా దానికి బాధ్యులను చేస్తూ మంత్రులపై యాక్షన్ తీసుకోకపోవడంతో చంద్రబాబు 1995 నాటి ముఖ్యమంత్రి గా మారతారన్న నమ్మకం లేదని పార్టీ నేతలే భావిస్తున్నారు. అలాగే క్యాడర్ కూడా ఇదే అభిప్రాయంలో ఉంది. చంద్రబాబు పదే పదే తనలో 1995 ముఖ్యమంత్రి ని చూస్తారన్న మాటలు వాస్తవరూపం దాల్చేదెన్నడూ అని క్యాడర్ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉంది. అయితే అప్పుడు ఆయన నలభై పదుల వయసులో ఉండటానికి ఆ దూకుడుకు కారణమన్న కామెంట్స్ కూడా లేకపోలేదు.
Next Story