Fri Nov 22 2024 16:31:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు కోటరీని పక్కన పెట్టారట.. వారంతా ఇప్పుడు దూరంగానేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది వేరు. ఇప్పుడు వేరుగా కనిపిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పథ్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన స్టయిల్ ను పూర్తిగా మార్చేశారు. అవినీతికి ఆమడ దూరంలో ఉంచేలా ఇటు ఎమ్మెల్యేలను, అటు ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో కొందరి మాటలను విశ్వసించేవారు. ఒక కోటరీలో ఆయన ఉండిపోయారు. ఐఏఎస్ కోటరీతో పాటు కొందరు పొలిటీషియన్స్, మీడియా అధిపతుల కోటరీ ఆయనపై ప్రభావం చూపేది. కానీ ఈసారి అందరినీ దూరం పెట్టినట్లు తెలిసింది. ఏ నిర్ణయమైనా తానే తీసుకుంటున్నారు.
ఆచితూచి తీసుకునేలా...
చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయమైనా అది ప్రభుత్వ విధానమైనా, పార్టీలో నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. గతంలో కొందరి వ్యక్తుల ప్రభావం ఆయనపై ఉండేది. కానీ ఈసారి మాత్రం సొంత నిర్ణయాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాతనే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. ఇంతకు ముందులాగా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరించడానికి వీలులేదు. చంద్రబాబుకు రాజకీయ పరిణామాలతో పాటు ప్రజల నాడి కూడా అర్థమయింది. 2014 ఎన్నికల్లో దూకుడుగా వెళ్లి బీజేపీకి దూరమై 2019 ఎన్నికల్లో ఓటమి పాలయమన్న ఆలోచనలో ఉన్నారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్ ను కూడా ఆలోచించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
పొలిటికల్ పార్టనర్స్‌తో...
తన పొలిటికల్ పార్టనర్స్ పవన్ కల్యాణ్, మోదీలతో సత్సంబంధాలను మళ్లీ ఎన్నికల వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. మొన్నటి ఎన్నికల్లో సీనియర్ నేతలను తప్పించినా పెద్దగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవడంతో యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందుకే నామినేటెడ్ పోస్టుల తొలి జాబితాలోనూ యువకులకు, కొత్త వారికే ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు పొత్తులు కారణంగా త్యాగాలు చేయాల్సి ఉంటుందని ముందుగానే చెప్పిన చంద్రబాబు నాయుడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నేతలను కూడా మంత్రి పదవులకు దూరం పెట్టారు. సీనియర్ నేతలు ఎక్కువ మంది ఉంటే తనపై ప్రభావం చూపే అవకాశముంటుందని కావచ్చు.
క్యాడర్ ను ఆర్థికంగా...
ఇక రానున్న కాలంలో క్యాడర్ ను ఆర్థికంగా బలోపేతం చేయడంపైనే ఆయన ఫోకస్ పెట్టనున్నారని తెలిసింది. క్యాడర్ బలంగా ఉంటే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సులువుగా విజయం సాధిస్తారన్న నమ్మకం చంద్రబాబులో పెరిగింది. అందుకే పెద్దగా సీనియర్ నేతలతో కూడా చర్చించడం వంటివి మానుకున్నారు. ఆయన తనకంటూ ఒక రాజకీయ ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో తాను మాత్రమే ఉండాలని భావిస్తున్నారు. తాను తీసుకునే నిర్ణయం తప్పైనా? ఒప్పైనా అది తనకే ఆపాదించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పార్టీని రానున్న కాలంలో మరింత బలోపేతం చేసే దిశగానే చంద్రబాబు అడుగులు వేయనున్నారు. దీంతో సీనియర్ నేతలకు, కోటరీకి దాదాపు చెక్ పడినట్లేనన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story