Tue Dec 17 2024 16:31:18 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుపై వత్తిడి పెరుగుతుందా? క్యాడర్ గుడ్లెర్రగా చేస్తుందిగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో బిజీగా ఉన్నారు. క్యాడర్ లో మాత్రం అసంతృప్తి ఉంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టి నాలుగు నెలలు కావస్తుంది. కానీ క్యాడర్ లో మాత్రం గెలిచిన ఆనందం మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ కార్యకర్తల్లో ఒక రకమైన నిరాశతో పాటు అసంతృప్తి కూడా ఉంది. అయితే దీనికి కారణం తమకు పదవులు దక్కలేదనో, మరేదో ప్రయోజనం చేకూరలేదనో మాత్రం కాదు. అందుకు ముఖ్య కారణం రివెంజ్ తీర్చుకోకపోవడమే. నాలుగు నెలలవుతున్నా ఒక్క వైసీపీ నేతను కూడా అరెస్ట్ చేయకపోవడం ఏంటన్న ప్రశ్న క్యాడర్ నుంచి వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నారంటే ఏ రేంజ్లో మదనపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
గత ఐదేళ్లలో తాము పడిన...
గత ఐదేళ్లలో తాము పడిన బాధలు ఇప్పుడు వైసీపీ నేతలు అనుభవించవద్దా? అంటూ పసుపు పార్టీ తమ్ముళ్లు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. తమతో పాటు పా్టీ అధినేత దగ్గర నుంచి అందరినీ వేధించిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తే తమ రక్తం ఉడికిపోతుందంటూ మరికొందరు పోస్టింగ్లు పెడుతున్నారు. తమను రోడ్లపైకి రాకుండా బలవంతంగా అడ్డుకోవడమే కాకుండా కేసులు పెట్టి వేధించారన్న విషయం పార్టీ అధినేతకు తెలియదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము న్యాయస్థానాల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికపోయిన విషయాన్ని విస్మరించారా? అంటూ నిలదీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇంకా వెయిట్ చేస్తే వైసీపీ నేతల మరింత రెచ్చిపోతారంటున్నారు.
ఎవరినీ వదిలపెట్టనంటూ...
అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియా సమావేశంలో ఎవరినీ వదిలి పెట్టేది లేదని ప్రకటించారు. చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా చేస్తే న్యాయస్థానాల్లో చిక్కులు తప్పవని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. క్యాడర్ తో పాటు సమానంగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడ్డారని, జైలుపాలయిన విషయాన్ని కూడా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయిందని, ముందు కక్ష సాధింపు చర్యలుకు దిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు.
ముందు ఈ పనులు చేసి...
ముందు రాష్ట్ర ఖజానాను సరిచేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సి ఉంది. నిధులను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకు రావాల్సి ఉంది. పాలన ఒక గాడిన పెట్టిన తర్వాత అప్పుడు ఇబ్బంది పెట్టిన వారిపై ఖచ్చితంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని, చట్టపరంగానే వారికి శిక్ష పడేలా చూస్తారని సీనియర్ నేతలు నచ్చ చెబుతున్నా క్యాడర్ మాత్రం ససేమిరా అంటుంది. తమకు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి కాదని, వైసీపీ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తుండటం విశేషం. మొత్తం మీద చంద్రబాబు మీద కొంత ప్రెషర్ అయితే క్యాడర్ నుంచి పెరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి అక్కడ ఉన్నది చంద్రబాబు అంత త్వరగా ఏనిర్ణయమూ తీసుకోరన్నది మాత్రం ఎవరూ మరచిపోకూడదు.
Next Story