Tue Dec 17 2024 12:45:17 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు మళ్లీ అదే పంథానా? మారవేమిటయ్యా బాబూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లే చేస్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లే చేస్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారన్నారు. అదే ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలంటూ లేవు కానీ, నిరంతరం సమీక్షలు,కాన్ఫరెన్స్ లతో కాలక్షేపం చేస్తూ తాను అనుకున్న పనులను మాత్రమే ముందుకు తీసుకెళుతున్నారు. గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కార్యాలయానిదే ఇప్పుడు మళ్లీ పైచేయి అయింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంవో వల్లనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక రకాలైన విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎవరినీ కలవకుండా సీఎంవో పిలిస్తేనే వెళ్లేందుకు అనుమతివ్వడం, నియోజకవర్గాల రాజకీయాల్లోనూ సీఎంవో జోక్యం చేసుకోవడంతోనే అక్కడ నేతల మధ్యవిభేదాలు ఎక్కువయ్యాయి.
అదే సీన్ రిపీట్...
మళ్లీ ఇప్పుడు కూడా చంద్రబాబు అదే సీన్ ను రిపీట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా టర్న్ అవుతారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే తన బలం అంటూ ప్రశంసిస్తారు. జగన్ కూడా అంతే. అధికారంలో ఉన్నప్పుడు కనపడని క్యాడర్ దానిని కోల్పోయిన వెంటనే గుర్తుకువస్తారు. చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తుంటారు. సహజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనను గాడిలో పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో పార్టీని, కార్యకర్తల భవిష్యత్ ను కూడా అంతే దృష్టిలో పెట్టుకుని చేయాలన్నది ఇద్దరూ మర్చిపోయే అంశం. అందుకే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో కూడా ఒకింత అసహనం ఆరు నెలల్లోనే బయలుదేరిందంటున్నారు.
పార్టీ కార్యాలయానికి వెళుతున్నప్పటికీ...
నిజానికి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళుతుండటం కొంత పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నప్పటికీ వారికి అవసరమైన విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ పట్ల, పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నాన్నది వాస్తవాలు తెలియాలంటే కార్యకర్తలే ముఖ్యం. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే ఏదైనా కరెక్ట్ విషయాలు తెలుస్తాయి. మద్యం కావచ్చు. ఉచిత ఇసుక విధానం కావచ్చు. సూపర్ సిక్స్ హామీల అమలు కావచ్చు. వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా తెలియాలంటే కార్యకర్తల నుంచే తీసుకోవాలి. నేతలు అస్సలు నోరు విప్పరు. అధికారులు పెదవి విప్పరు.
మళ్లీ అధికారులపై...
కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు మళ్లీ మరోసారి ప్రజా స్పందనపై అధికారులపై ఆధారపడుతున్నట్లే కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా యంత్రాంగం నుంచి ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో తప్పుడు సమాచారం అందే అవకాశం ఉందని నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్ల పై ఆధారపడి ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు 1995లో సీఈవో మాదిరిగానే వ్యవహరిస్తున్నారని, మూడు దశాబ్దాలయినా అందులో ఎలాంటి మార్పు రావడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఈ విషయం ఆలోచించుకుని గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకునేందుకు వేరే మార్గాలను ఎంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Next Story