Wed Apr 23 2025 11:28:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు భయమంతా వారి నుంచే నట.. దారిలో పెట్టకుంటే అసలుకే మోసం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదోసారి కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అందుకే ఈసారి ఆయన అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతూ ప్రజల విశ్వాసం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛను నెలకు ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు. అదే సమయంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని గత దీపావళి నుంచి అమలు చేశారు. ఇక లాండ్ టైటలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. త్వరలో మెగా డీఎస్సీని కూడా పూర్తి చేసి నిరుద్యోగుల నుంచి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
పథకాలను గ్రౌండ్ చేస్తూ...
మరొకవైపు మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆకట్టుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. మే నెలలో ఈ పథకం ప్రారంభమయితే, ఇక పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడగలిగితే వచ్చే ఎన్నికల్లో అన్నదాతలు కూడా తమకు వెన్నుదన్నుగా నిలుస్తారని నమ్ముతున్నారు. ఇందుకోసం ఇటీవల బడ్జెట్ లోనూ ఈ పథకానికి నిధులు కేటాయించారు. అలాగే ఇక జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకం కూడా అమలు చేయనున్నారు. ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు పదే పదే చెబుతూ మహిళలను తన వైపు నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇసుకను సొమ్ము చేసుకుంటూ...
అయితే ఎమ్మెల్యేలపై మాత్రం చాలా వరకూ వ్యతిరేకత ఉందని ఆయనకు వచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా అందుతున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉచిత ఇసుకను సొమ్ము చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. దాదాపు 70 శాతం మంది ఎమ్మెల్యేలపై ఉచిత ఇసుకలో చేతివాటాన్ని చూపుతున్నారన్న ఫిర్యాదులు పార్టీ స్థానిక నేతల నుంచే ఫిర్యాదులు అందుతున్నాయి. తాము ప్రజల కోసం ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడితే దానిని ఓట్ల రూపంలో మలచుకోవాల్సిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది సొమ్ము చేసుకోవడంపై చంద్రబాబు ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. వీరికి ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా వారిలో మార్పు లేకపోవడంపై ఇటీవల ఒకింత సీరియస్ కామెంట్స్ చేసినట్లు సమాచారం.
కొత్తగా ఎన్నికైన...
దీంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు మద్యం దుకాణాల్లో వాటాదారులుగా చేరి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంటున్నారన్న ఫీడ్ బ్యాక్ కూడా అందడంతో ఎమ్మెల్యేలను కట్టడి చేయడంపైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఎక్కువ మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని కూడా సర్వే నివేదికలు అందడంతో వీరికి వార్నింగ్ లతో సరిపెట్టేకన్నా వచ్చే ఎన్నికల నాటికి మార్చేయడమే బెటర్ అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇంకా నాలుగేళ్లు సమయం ఉండటంతో వారిలో మార్పు కనిపిస్తే తిరిగి టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తానని కూడా అంతర్గత సమావేశాల్లో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు తన పాలనపైన కన్నా ఎమ్మెల్యేల పనితీరుపైనే ఎక్కువగా భయపడుతున్నట్లు తెలిసింది.
Next Story