Sun Mar 02 2025 22:22:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కార్నర్ చేస్తున్నది ఎవరో కాదు.. టీడీపీలో వింత పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పాలిటిక్స్ లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ పాలిటిక్స్ లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రిగా చేసినా ఎన్నడూ లేని సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. అదే సొంత పార్టీ క్యాడర్ నుంచే. ఇటీవల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటికి చేరడంతో సంతోషించే సమయంలోనే మరొక వైపు సోషల్ మీడియాలో సొంత పార్టీ క్యాడర్ పెడుతున్న పోస్టింగ్ లను చూసి టీడీపీ అగ్రనాయకత్వం ఇబ్బందులను ఎదుర్కొంటుంది. 1995 నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు సహజంగా ఏ నిర్ణయమైనా నేతలతో అంటే పొలిటి బ్యూరో చర్చించి తీసుకుంటారు. ప్రజాస్వామ్య యుతంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన చెబుతారు.
విపక్షాల కన్నా...
కానీ ఈసారి మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా విపక్ష నేతలు వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ టీడీపీ సోషల్ మీడియా నుంచే ఘాటు కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రతి నిర్ణయాన్ని క్యాడర్ పోస్టుమార్టం చేసేస్తుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ నుంచి వైసీపీ నేతలపై యాక్షన్ లేకపోవడం వరకూ అన్నింటా టీడీపీ కార్యకర్తలు పార్టీ అగ్రనాయకత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ఇంత వరకూ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ రోజుకు ఒకసారైనా క్యాడర్ సోషల్ మీడియాలో నిలదీస్తుంది. తమను ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేతలు అంత ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు చూసీ చూడనట్లు వదిలేయడమేంటని నిలదీస్తున్నారు. దీనికి నేతలు సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు.
నియోజకవర్గాల పరిస్థితులపైనా...
ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల విషయాలను కూడా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వదిలిపెట్టడం లేదు. ఎవరిమీదనైనా సరే నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చాలు వెంటనే టీడీపీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పోస్టింగ్ లు కనపడుతుండటంతో పార్టీ అధినాయకత్వాన్నికలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు ఉందని పార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల్లో జనసేన నేతల జోక్యాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే బీజేపీ నేతలను కూడా టీడీపీ సోషల్ మీడియా వదిలిపెట్టడం లేదు. దీంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు.
ఫీడ్ బ్యాక్ వస్తున్నప్పటికీ...
మరొక వైపు క్యాడర్ నుంచి బలమైన ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశముందని భావిస్తున్నప్పటికీ తమ సొంత సోషల్ మీడియా ప్రత్యర్థి పాత్ర పోషించడం కొంత ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబునాయుడు, లోకేష్ వంటి నేతల నిర్ణయాలను కూడా కడిగిపారేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంతో పాటు మద్యం దుకాణాల కేటాయింపు ఇలా ఒక్కటేమిటి అన్ని అంశాలపై సొంత పార్టీనే క్యాడర్ కార్నర్ చేస్తుండటంతో అటు పోస్టింగ్ లను పెట్టేవారిపై చర్యలు తీసుకోలేక, ఇటు వారిని ఆపలేక టీడీపీ నాయకత్వం రాజకీయంగా ఇబ్బందుల పాలవుతుంది. దీంతో క్యాడర్ ను కంట్రోల్ చేయడంపైనే ప్రస్తుతం ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మరి లోకేష్ అయినా క్యాడర్ ను కంట్రోల్ లో పెట్టాలని నేతలు కోరుతున్నారు.
Next Story