Fri Nov 22 2024 21:23:48 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ఇక వేగం పెంచుతున్నారా? అందుకు రీజన్ అదేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత గాడిన పడటంతో ఇక సూపర్ సిక్స్ హామీల అమలుపై ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రవేశ పెట్టిన తర్వాత వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఇప్పటికే ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి నెల ఒకటోతేదీన పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలకు ఇబ్బంది కలగకుండా తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
యువతకు కూడా...
ప్రధానంగా మహిళలే కాకుండా యువత, ఉద్యోగ అవకాశాల కల్పన పై కూడా ఆయన రానున్న కాలంలో ఫోకస్ పెంచనున్నారు. ఇప్పటికే విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. పది వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు అత్యధిక శాతం మంది ఏపీలో భవన నిర్మాణ కార్మికులున్నారు. కొన్ని లక్షల మంది ఈ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్ ఇక అమరావతిలో భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. త్వరలోనే సీఆర్డీఏ దీనికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతుంది.
భవన నిర్మాణ కార్మికులు...
అమరావతిలో భవన నిర్మాణ పనులు ప్రారంభమయితే ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుంది. ఇక యువత కోసం నెలవారీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనూ చంద్రబాబు సీిరియస్ గా ఆలోచిస్తున్నారట. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీనివల్ల ఖజానాపై ఎంత భారం పడుతుందన్న నివేదికను తనకు వీలయినంత త్వరలో సమర్పించాలని చంద్రబాబు కోరినట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెబుతారు.
సంక్రాంతి నుంచి...
దీంతో పాటు పేదరికం నిర్మూలన కోసం సంక్రాంతి పండగ నుంచి పీ-4 ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కూడా చంద్రబాబు ప్రకటించారు. విపక్షాల విమర్శలకు ఒక చోటివ్వకుండా వెంట వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలులో ఆలస్యం అయితే ప్రజలలో కొంత అసంతృప్తి నెలకొంటుందని, స్థానిక సంస్థలలో కొంత ఇబ్బందులు జరిగే అవకాశముందని భావించి ఆయన క్విక్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రజల నుంచి కొంత వత్తిడిని ఎదుర్కొంటుండటం కూడా సూపర్ సిక్స్ హామీల అమలును వేగంగా చేయాలని నిర్ణయించుకున్నారు.
Next Story