Mon Dec 23 2024 16:00:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారా? వాటిపై క్లారిటీ ఇస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలున్నాయి. ఈనెల 15వ తేదీ నుంచి సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలను కొన్నింటిని అమలు పర్చే వీలుండటంతో దీనిపై చంద్రబాబు స్పష్టత ఇచ్చేందుకు ఛాన్స్లున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ఖరారు కావడంతో నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ వారికి వివరించే అవకాశాలున్నాయి.
అన్నా క్యాంటిన్ల నిర్వహణ...
అన్నా క్యాంటిన్లను ఇప్పటికే అనేక చోట్ల ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నారు. పేదలకు కడుపు నిండా భోజనం ఐదు రూపాయలకే పెడతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పినట్లుగానే ముందుగా దానిని అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అన్నా క్యాంటిన్ల వద్ద రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం, వచ్చిన వారందరికీ భోజనం అందేలా ఏర్పాటు చేయడం వంటి వాటివి చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించే అవకాశముందని తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం...
దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధశించిన విధివిధానాలను సిద్ధం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ సూపర్ సిక్స్ లో చెప్పిన ఉచిత బస్సు పథకం అమలు చేయలేదన్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ఈ పథకాన్ని ఆరోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు నెలకు 250 కోట్ల రూపాయల అవసరం అవుతుందని అంచనా వేశారు. అయితే తగినన్ని బస్సులు కల్పించడంతో పాటు టిక్కెట్లు కొనుగోలు చేసిన పురుషులకు సీట్లు ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి వాటిపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
పాలనలో వేగం...
వీటితో పాటు పాలనలో వేగం పెంచాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించనున్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరనున్నారు. ముఖ్యంగా అర్హులైన లబ్దిదారులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఎంపిక ఉండాలని చెప్పనున్నారు. అధికారులు పౌరసేవలు సత్వరం అందించేందుకు ఎక్కడికక్కడ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించనున్నారు. దీంతో పాటు ముఖ్యంగా శాంతి భద్రతలపై ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడా లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడవద్దని, ఘటన జరిగిన వెంటనే అందుకు కారణాలను వెంటనే వివరించి ప్రజల్లో నెలకొన్న అపోహలను పోగొట్టే ప్రయత్నం చేయాలని ఎస్పీలకు చెప్పనున్నారు.
Next Story