Mon Dec 23 2024 12:42:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు గతంలో లాగా కాదు.. ఇప్పుడు పూర్తిగా ఫిక్సయ్యారు..పార్టీ భవిష్యత్ కోసం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో మాదిరి కాదు. పూర్తిగా మారిపోయారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు గతంలో మాదిరి కాదు. పూర్తిగా మారిపోయారు. గతం కంటే భిన్నంగా ఆయన కనిపిస్తున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే. పార్టీకి మరింత జీవిత కాలం ప్రసాదించడం. తన రాజకీయ వ్యూహాలు వారసులకు వంటబడతాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఆయన ఈసారి మాత్రం కొంత ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పుడున్న కాంబినేషన్ ను సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎలాంటి దూకుడు నిర్ణయాలకు పోకుండా పార్టీకి మంచి భవిష్యత్ ను అందించడానికి ఆయన అడుగులు వేస్తునట్లే కనిపిస్తుంది. ఇప్పుుడు ఇదే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కాంబినేషన్ ను కొనసాగించలని...
2019 ఎన్నికల వరకూ చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వారికి, ఇప్పుడు చూస్తున్న వారికి ఆ తేడా సులువుగా అర్థమయిపోతుంది. గతంలో రాజీ ఉండేదికాదు. అవసరాలు తీరిన వెంటనే వదిలించుకుంటారని ఆయనపై విమర్శలుండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన సుదీర్ఘ కాలం పార్టీకి అధికారం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లే కనిపిస్తుంది. 2014, 2024 కాంబినేషన్ సక్సెస్ కావడంతో దానినే దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతుంది. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మిత్ర పక్షాలకు కూడా అవసరమైన ప్రయారిటీ ఇవ్వడంతో పాటు వీలయితే పార్టీ నేతలకు త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పడం వంటివి ఆ కోవలోకి చెందినవేనని భావించాల్సి ఉంటుంది. కమ్మ, కాపు కాంబినేషన్ సూపర్ సక్సెస్ కావడంతో దానిని సుదీర్ఘకాలం కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
అన్నింటికీ తలొగ్గి...
అందుకే కాపు సామాజికవర్గం నేతలకు మంచి ప్రయారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీని బలహీనం చేస్తూనే మిత్ర పక్షాలను కూడా కలుపుకుని వెళ్లాలని సీనియర్ నేతలకు ఆయన సూచించినట్లు తెలిసింది. సీనియర్ నేతలను అందుకే మంత్రివర్గంలోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినట్లు చెబుతారు. దీంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ పదవులతో లాలూచీ పడకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవుల కోసం, పోర్ట్‌ఫోలియోల కోసం ఆయన ఢిల్లీ పెద్దలపై వత్తిడి తేకుండా ఉండటానికి కూడా కారణమిదేనని చెబుతున్నారు. చివరకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా వద్దని సున్నితంగా తిరస్కరించారంటే ఆయన గోల్ చెప్పకనే తెలుస్తోంది.
రికార్డును అధిగమించేలా...
దీంతో పాటు చంద్రబాబు ఈ టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుంటే 19 ఏళ్లు పూర్తయినట్లవుతుంది. ఆయన రికార్డును తెలుగు రాష్ట్రాల్లో మరేనేత అధిగమించలేరు. లేకపోవచ్చుకూడా. అందుకే ఇప్పుడు ఆయనకు కీర్తి, పేరు ముఖ్యం. ఆయన ఫోకస్ మొత్తం రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడంపైనే పెట్టారని చెబుతున్నారు. ఈ రెండు ఈ ఐదేళ్లలో పూర్తయితే తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని, పార్టీకి కూడా తిరుగుండదని ఆయన భావిస్తున్నారు. ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి తనపై ఉన్న విమర్శలకు ఆయన చెక్ పెట్టాలన్న ప్రయత్నం ఆయనలో కనిపిస్తుందని ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు. అసలే పనిరాక్షసుడిగా ఆయనకు పేరు. ఈ ఐదేళ్లు కూడా నిద్రాహారాలు మాని ఏపీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఆల్ ది బెస్ట్ చంద్రబాబూ.
Next Story