Tue Dec 03 2024 18:00:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జనవరిలో మరొక హామీ అమలు.. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు
రానున్న జనవరి నెలలో మరొక గుడ్ న్యూస్ చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు
రానున్న జనవరి నెలలో మరొక గుడ్ న్యూస్ చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. వరసగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ పింఛన్లను నాలుగువేల రూపాయలు పెంచడంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ ను కూడా అమలు చేశారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఒకింత ఆలోచనలో పడినా తిరిగి దానిని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులతో ఇప్పటికే సమాలోచనలు జరిపిన చంద్రబాబు సంక్రాంతి కానుకగా అందించనున్నారు.
అధికారుల ప్రతిపాదనను...
సంక్రాంతి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం ఉంటున్న ప్రతి మహిళకు ఈ అవకాశం కల్పించాలా? లేక దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే అందించాలా? అన్న దానిపై ఇంకా ఇక నిర్ణయానికి రాలేదు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో ప్రతి మహిళకు ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఏపీలో దానిలో కొంత మార్పులు చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారు. కేవలం తెలుపు రంగు రేషన్ కార్డులున్న మహిళలకే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదన ఒకటి అధికారులు చంద్రబాబు ముందుంచారు. అయితే దీనిపై ఆయన ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది.
అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే...
అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా అందరు మహిళకు ఉచితబస్సు ప్రయాణం కల్పిస్తేనే బాగుంటుందని మంత్రులు కూడా సూచిస్తున్నారు. కేవలం కొన్ని వర్గాలకే పరిమితం చేస్తే అది వివాదానికి దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాదాపు ఐదు వందల కోట్లకు పైగానే నెలకు ఖర్చవుతుందని ప్రాధమికంగా అంచనా వేయడంతో అందరికీ కల్పించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఉన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈలోపు కొన్ని అదనపు బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఏపీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేసిన తర్వాత, బస్సుల కొరత లేకుండా చూడటంతో పాటు పురుషులకు బస్సుల్లో ప్రత్యేక సీట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం కూడా ఒక సవాల్ గా మారనుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వచ్చే అవకాశముంది.
Next Story