Tue Apr 22 2025 19:22:50 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. వారిని వదిలించుకోకపోతే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పేషీలపై ఒక కన్నేసి ఉంచారు. నిరంతరం నిఘా పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పేషీలపై ఒక కన్నేసి ఉంచారు. నిరంతరం నిఘా పెట్టారు. మంత్రుల పేషీల్లోని ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వారిపై చర్యలకు దిగుతున్నారు. నేరుగా ఆయన రంగంలోకి దిగి వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై అవినీతి అరోపణలు రావడంతో అతనిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటలిజెన్స్ నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ మంత్రుల పేషీల్లో ఏమాత్రం అవినీతి జరుగుతున్నప్పటికీ వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కొందరు మంత్రులు హెచ్చరించినా వినకపోవడంతో వారిపై నేరుగా చర్యలకు దిగుతున్నారు.
గుడ్డిగా నమ్మవద్దని...
గతంలోనూ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై ఫిర్యాదులు రావడంతో వెంటనే విధుల నుంచి తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇంకా అనేక మంది మంత్రుల పేషీల్లో ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న నిఘా సంస్థల నివేదికలతో చంద్రబాబు నాయుడు మంత్రులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గుడ్డిగా వారిని నమ్మవద్దని, వారిపై ఒక కన్నేసి ఉంచాలని చెబుతున్నప్పటికీ వారిపై ఎక్కువగా ఆధారపడుతున్న మంత్రుల పేషీల్లోనే ఈ రకమైన తతంగం జరుగుతుందని గుర్తించారు. దీంతో మంత్రులకు తెలియకుండానే వారి పేషీల్లోని సిబ్బందిని తొలగిస్తున్నట్లు జీఏడీ నుంచి ఆదేశాలు అందతుండం విశేషం.
ఎల్లుండి కేబినెట్ లో...
ఈ విషయంపై ఎల్లుండి జరిగే మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మరోసారి మంత్రులకు క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులు కేవలం తమ శాఖపైన దృష్టి పెట్టడమే కాకుండా తన పేషీలో ఏ: జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తగా లేకపోతే వారు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారని చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో గట్టిగా చెప్పనున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదికలను కూడా మంత్రుల ముందు ఉంచనున్నారు. ఇలా ఉపేక్షించుకుంటూ వెళితే మంత్రులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న హెచ్చరికలు చంద్రబాబు జారీ చేయనున్నారు. దీంతో ఏ మంత్రులకు క్లాస్ పీకుతారన్నది ఉత్కంఠగా మారింది.
Next Story