Tue Nov 05 2024 13:59:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu: చంద్రబాబు ఆ ఆదేశాలతో వారికి కష్టాలు తప్పినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళపై ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. గిరిజన మహిళలు అనారోగ్యం పాలయితే వారిని డోలీల్లో తీసుకు రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అనేక సార్లు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రహదారుల సౌకర్యం లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో మహిళలతో పాటు గిరిజనులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి తప్పనిసరి. అందులోనూ గిరిజన మహిళలు గర్భిణిగా ఉన్నప్పుడు వారిని డోలీలో తీసుకు రావడం ఇబ్బందికరంగా మారింది. కొన్ని సార్లు డోలీలోనే ప్రసవం అయిన ఘటనలు అనేకం ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
డోలీ మోతలు కనపడకుండా....
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెలలు నిండిన గర్భిణుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని తెరవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నెలలు నిండిన గర్భిణులను డోలీలో తీసుకెళ్లకుండా వెంటనే మానవీయ కోణంలో ఆలోచించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డోలీ మోతలు ఇక ఏజెన్సీ ప్రాంతంలో కనిపించ కూడదని అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వారికి అవసరమైన వైద్య సౌకర్యాలను అక్కడికక్కడే అందించేలా ఏర్పాటు చేయాలని కూడా అధికారులను కోరారు. డోలీ కనపడితే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. వచ్చే నెలలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది.
Next Story