Sat Nov 16 2024 02:50:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మందుబాబులకు గుడ్ న్యూస్... ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎక్సైజ్ శాఖపై సమీక్ష చేయనున్నారు. అయితే మందుబాబులకు ఈ సమావేశంలో గుడ్ న్యూస్ అందించే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చారు. ఒకరకంగా జగన్ ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడానికి మద్యం పాలసీ కూడా ఒక కారణం. మద్యం ధరలను విపరీతంగా పెంచడం, బ్రాండ్లను ఇష్టమొచ్చినట్లు ప్రవేశపెట్టడం వల్లనేనని అనేక రకమైన విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు మద్యం గురించి పదే పదే ప్రస్తావించారు. మందుబాబులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
జనంలోకి...
అయితే మద్యం నియంత్రణలో భాగంగా తాము లిక్కర్ ధరలను పెంచామని జగన్ ప్రభుత్వం చెప్పినప్పటికీ మందుబాబులు పెద్దగా పట్టించుకోలేదు. దీనికి తోడు నాసికరమైన మద్యం తాగి అనేక మంది మరణించారంటూ చంద్రబాబుతో పాటు నాడు విపక్షాలు పెద్దయెత్తున విమర్శలు చేశాయి. అది ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అమ్మఒడి ఇచ్చి... నాన్న బుడ్డి అంటూ చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి బలంగా మద్యం విషయాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. జగన్ ఓటమికి మద్యం ధరలు పెంచడంతో పాటు నాణ్యమైన బ్రాండ్లను అందించకపోవడం కూడా ఒక కారణమని ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలు బహిరంగంగానే అంగీకరించారు.
మద్యం ధరలను...
దీంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం ధరలను అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. నాణ్యమైన, పాత బ్రాండ్లను అందుబాటులోకి తెస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. దీంతో పాటు ఈ సమీక్షలో చంద్రబాబు నూతన మద్యం పాలసీపై కూడా చర్చించే అవకాశముంది. అక్టోబరు నాటికి కొత్త ఎక్సైజ్ పాలసీని తేవాలని చంద్రబాబు భావిస్తున్నారు. మద్యం ధరలు తగ్గించడంతో పాటు వైన్ షాపులు కూడా ప్రభుత్వం కాకుండా ప్రయివేటు వ్యక్తులు నిర్వహించేలా పాత పాలసీని అమలులోకి తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. అందుకోసమే ప్రత్యేకంగా చంద్రబాబు నేడు ఎక్సైజ్ శాఖతో సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు నాటు సారా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, బెల్ట్ షాపులు లేకుండా తగిన చర్యలు తీసుకునేలా ఒక విధానాన్ని రూపొందిచడానికి ముఖ్యమంత్రి సిద్ధమయినట్లు తెలిసింది. మరి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story