Sun Nov 17 2024 18:33:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏందిది చంద్రన్నా... ఐదేళ్లు పనిచేయకపోతే... కరోనా సమయంలో ఎలా జరిగేది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఒకింత చర్చకు దారి తీస్తున్నాయి
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ఒకింత చర్చకు దారి తీస్తున్నాయి. ఐదేళ్ల నుంచి అన్ని వ్యవస్థలను పనిచేయడం మానేశాయన్నారు. అంటే గత ప్రభుత్వంలో ఐదేళ్లు పాలన జరగలేదా? ఎలాంటి కార్యక్రమాలు అమలు కాలేదా? అధికారులు ఆఫీసుల్లోనే గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారా? అంటే ఒకవైపు నవ్వొస్తుంది. మరొక వైపు ఇది రాజకీయ విమర్శ కాదా? అన్న చర్చ ప్రజల్లో పెద్దయెత్తున జరుగుతుంది. ఎందుకంటే ఐదేళ్ల పాటు వ్యవస్థలు పనిచేయకపోతే రాష్ట్రం ఏ విధంగా నడిచిందన్న ప్రశ్నకు సమాధానం మాత్రం బహుశా దొరకకపోవచ్చు.
కరోనా సమయంలో...
కరోనా సమయం తీసుకోండి. కరోనా సమయం రెండేళ్లు. ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఇలాంటి క్రైసిస్ సమయంలో అధికారులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే కదా? ప్రాణాలు అనేక సంఖ్యలో రక్షించగలిగారు. కరోనా సమయంలో ఇదే అధికారులు పనిచేశారే. వారు సెలవులు పెట్టి ఇళ్లకు వెళ్లిపోలేదే. వారు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోబట్టే కదా? ఆంధ్రప్రదేశ్ లో కొంత కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య తగ్గించగలిగింది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రజలు బయటకు రాకపోయినా వారికి అన్ని రకాలుగా సదుపాయలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇదే అధికారులు కాదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు కూడా...
ముఖ్యంగా పోలీసులు కరోనా సమయంలో రోడ్డు మీదకు వచ్చి వారు చేసిన సేవలను ఇప్పటికీ ఎవరైనా మర్చిపోగలరా? అంటూ నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వాలంటీర్ వరకూ చేయబట్టే కదా? వారికి సరైన సమయంలో వైద్యం అందిచగలిగింది. ఆ విషయం మర్చి పోతే ఎలా చంద్రబాబు అని నిలదీస్తున్నారు. ఏం జరిగినా? ఏ తప్పు దొర్లినా అది గత ప్రభుత్వం మీదనో, అప్పుడు అనుకూలంగా ఉన్న అధికారుల మీదనో వేయడం మినహా వరదల సమయంలో అందించాల్సిన వాటిపై ఫోకస్ పెంచాలని కోరారు. ఇప్పుడు కూడా అధికారుల నుంచి సిబ్బంది వరకూ రేయింబవళ్లూ నాలుగురోజుల నుంచి పనిచేస్తున్న సంగతి చంద్రబాబుకు తెలియదా?
దానికి కారణాలు...
చంద్రబాబు వ్యాఖ్యలు పనిచేసే అధికారులను మానసికంగా దెబ్బతీయవా? అంటూ కూడా మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం మీద వరదనీరు వెళ్లకముందే మడ్ పాలిటిక్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పుడు కూడా కొందరికి సాయం అందలేదంటే అందుకు బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఫుడ్ మెటీరియల్ అంది ఉండకపోవచ్చు. లేదా నీరు లోతుగా ఉండటంతో అక్కడకు వెళ్లలేకపోవచ్చు. ఇలాంటి కారణాలు అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకోలేని చంద్రబాబు అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఒకింత అధికార, ఉద్యోగ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ వరదలు వచ్చాయని, ఆ సమయంలో తాము పనిచేసి ప్రజలకు సాయం అందించామని ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
Next Story