Fri Dec 20 2024 16:52:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు హస్తిన పర్యటన కలిసి వచ్చేటట్లే ఉందిగా.. గుడ్ న్యూస్ సౌండ్ పెద్దదిగానే ఉంటుందట భయ్యా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఎల్లుండి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈనెల 4వ తేదీన ఆయన ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. వారితో సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన నిధుల విషయంలో వారితో చర్చిస్తారని తెలిసింది. దీంతో పాటు ముఖ్యమైన విషయాలను చర్చించేందుకే చంద్రబాబు నాలుగో తేదీ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని తెలిసింది.
సహకారం కోసం...
రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయింది. దీనిని గాడిన పడేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. అనేక విషయాల్లో కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర సాయాన్ని కోరేందుకే చంద్రబాబు ఈ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ఐదేళ్లలో రెండు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైన ప్లాన్ ను రూపొందిస్తున్నామని, అందుకు కావాల్సిన నిధులను కూడా తమకు సకాలంలో ఇవ్వాలని ఆయన కోరనున్నట్లు తెలిసింది.
నిధుల సమీకరణకు ....
దీంతో పాటుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రానికి కొన్ని వెసులుబాటు కల్పించాలని ఈ పర్యటనలో ప్రధాని మోదీని చంద్రబాబు కోరనున్నారు. పింఛన్లు, వేతనాలతో పాటు ముఖ్య హామీలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు చేయూత నివ్వాలని చంద్రబాబు కోరనునన్టలు తెలిసింది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయీల అంశాలను కూడా చంద్రబాబు ఈ పర్యటనలో మోదీ ఎదుట ప్రస్తావించనున్నట్లు తెలిసింది. విభజన హామీలను కూడా అమలు చేసేలా మంత్రులకు, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మోదీ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
కేంద్ర బడ్జెట్ లో...
ిఇక త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ విషయంలోనూ ఏపీ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరనున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరనున్నారు. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభావం పనిచేసిందని ప్రజలు భావించే అవకాశముందని మోదీకి తెలపనున్నారు. కేంద్రం ఈసారి బడ్జెట్ లో పోలవరం, అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే ప్రజలు హర్షిస్తారని కూడా సూచించనున్నారు. చంద్రబాబు ఈ నెల 4న ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చిపెడుతుందని పార్టీ నేతలు కూడా ఆశిస్తున్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మాత్రమే పూడ్చమని కేంద్రాన్ని అడగటంలో తప్పులేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Next Story