Sat Nov 23 2024 02:13:06 GMT+0000 (Coordinated Universal Time)
రోశయ్యకు జగన్ నివాళులు
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మృతి తనను బాధించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థికమంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జగన్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
గుర్తు చేసుకున్న పవన్...
రోశయ్య మృతి వ్యక్తిగతంగా తనను బాధించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఆయనను రెండు మూడుసార్లు కలిశానని, ఆయన నుంచి విలువైన సలహాలు తీసుకున్నానని పవన్ గుర్తు చేసుకున్నారు. పాలనాపరంగా ఆయన చూపిన వ్యవహారశైలి, విజ్ఞతను ప్రజలు మరచిపోలేరని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
చిరంజీవి ఏమన్నారంటే.
ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహానేతగా మెగాస్టార్ చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలను రోశయ్య కాపాడటంలో ఒక రుషి మాదిరిగా సేవ చేశారని చెప్పారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తనను రాజకీయాల్లోకి రావాలని రోశయ్య మనస్ఫూర్తిగా ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు.
ఏపీ కాంగ్రెస్ ....
రోశయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ అన్నరాు. రోశయ్య మరణంతో ఒక రాజనీతిజ్ఞుడు, ఆదర్శవాదిని కోల్పోయామని శైలజానాధ్ అన్నారు. రోశయ్య మృతిపట్ల మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
బీజేపీ ఉపాధ్యక్షుడు....
రోశయ్య మృతి బాధాకరమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారన్నారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకూ, తర్వాత గవర్నర్ పదవులను అలంకరించిన రోశయ్య వాటికే వన్నె తెచ్చారని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story