Tue Dec 24 2024 02:38:55 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు? అసలు రీజన్ అదేనా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో పెద్దలను కలవకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. గెలవక ముందు ఆయన వేరు. అధికారంలోకి వచ్చి డిప్యూటీ ీసీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మరొక పవన్ ను పార్టీ నేతలు చూస్తున్నారు. దూకుడు తగ్గించారు. సౌమ్యంగా ఉంటున్నారు. తన పని ఏదో అంతవరకే పరిమితమయ్యారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలవడం మానుకున్నారు. మంత్రి వర్గ సమావేశాల్లో మినహా మరెప్పుడూ చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించడం లేదు. ఇదంతా ఒక ఎత్తయితే మరొక అంశంపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది.
పరపతి ఉన్నా...
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ కు ఢిల్లీ పెద్దల దగ్గర పరపతి ఉంది. పవన్ కల్యాణ్ ను బీజేపీ పూర్తిగా విశ్వసిస్తుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పవన్ కల్యాణ్ ను రాజకీయంగా దగ్గర తీసుకుంటారు. అసలు కూటమి ఏర్పడటానికి పవన్ కల్యాణ్ కారణం. వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ను పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయాలపై చర్చించారు. అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక టీడీపీని కూటమిలో భాగస్వామిని చేయడానికి తాను బీజేపీ అధినాయకత్వం వద్ద తిట్లు కూడా తిన్నానని పవన్ స్వయంగా వెల్లడించారు.
ఒకే ఒకసారి...
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కల్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. అంతే తప్ప తర్వాత ఆయన ఢిల్లీ వైపు చూడలేదు. ఖజానా ఖాళీగా ఉందని పవన్ కు తెలుసు. కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు ఇంకా అందవలసి ఉందని కూడా పవన్ కు తెలియంది కాదు. కానీ ఇప్పటి వరకూ ఢిల్లీకి వెళ్లకపోవడానికి కారణం ఏంటన్నది మాత్రం నేతలకే అర్థం కావడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను కలసి వచ్చారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆయన వెంట వెళ్లడం లేదు. రాష్ట్రానికే పరిమితమయ్యారు.
అందుకే వెళ్లడం లేదా?
ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ప్రభుత్వ పెద్దలపై వత్తిడి తేవడం పవన్ కు ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నందున తాను వెళ్లడం అనవసరమన్న ఆలోచన కూడా ఉందంటున్నారు. పోనీ.. తన శాఖకు చెందిన కేంద్ర మంత్రులను ఢిల్లీకి వెళ్లి కలిసే ప్రయత్నం కూడా పవన్ కల్యాణ్ చేయడం లేదు. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళితే ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకూ వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తారు. అయినా ఆయన ఢిల్లీకి వెళ్లకపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఢిల్లీ వ్యవహారమంతా చంద్రబాబుపై వదిలేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరి అసలు రీజన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Next Story