Thu Apr 10 2025 15:00:54 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎవరికీ నో లీవ్.. నో రిలీవ్.. వైసీపీ అనుకూల ఉన్నతాధికారులకు ఇరకాటం
వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది

వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అనేక మంది ఉన్నతాధికారులకు దీర్ఘకాలిక సెలవు ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎవరినీ డిప్యుటేషన్ పై వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ అనేక అవకతవకలకు పాల్పడటమే కాకుండా, తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు ఎట్టిపరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులుండవని తేల్చి చెప్పింది. అందరూ ఉండాల్సిందేనని, ఎవరికీ దీర్ఘకాలిక సెలవు మంజూరు చేయమని, అలాగే ఇతర రాష్ట్రాలకు, కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయబోమని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వంలో కొందరు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ పై ఇక్కడకు వచ్చారు.
డిప్యుటేషన్ ను రద్దు చేయాలంటే...
వారిలో కొందరు ఇప్పటికే తమ డిప్యుటేషన్ ను రద్దు చేసి, తమను రిలీవ్ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కొందరు కేంద్ర సర్వీసుల నుంచి కూడా వచ్చారు. వారు కూడా తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే వారెవ్వరినీ పంపమని, పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతనే రిలీవ్ చేస్తామని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. సీఐడీ చీఫ్ సంజయ్ విదేశాలకు వెళ్లేందుకు పెట్టుకున్న అనుమతిని తిరస్కరించింది. ఆయన తిరిగి తన సెలవు ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి పెట్టుకున్న సెలవు ప్రతిపాదనను కూడా ప్రభుత్వం అంగీకరించలేదు.
పేరెంట్ డిపార్ట్మెంట్కు...
అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఐజీ రామకృష్ణ తనను పేరెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. గనుల శాఖ ఎండీ వెంకటరెడ్డి తనను రిలీవ్ చేయాలని పెట్టుకున్న అప్లికేషన్ కూడా బుట్టదాఖలయింది. అలాగే సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తనను కేంద్ర సర్వీసులకు రిలీవ్ చేయాలని కోరితే అందుకు అంగీకరించలేదు. వీరితో పాటు బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి తనను మాతృసంస్థకు పంపాలని కోరారు. ఆయనను ఎన్నికల కమిషన్ పోలింగ్ కు ముందు బదిలీ చేసింది. అయితే ఆయన తనను రిలీవ్ చేయమని పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది.
పాలకులు చెప్పినట్లే...
ఇక అనేక మంది అధికారులు పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం హోల్డ్ లో పెట్టింది. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయ్యేంత వరకూ అందరినీ ఇక్కడే ఉంచాలని, తమను ఇబ్బంది పెట్టిన అధికారులను ఇక్కడే ఉంచి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్న ప్రయత్నంలో కొత్త ప్రభుత్వం ఉంది. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఐఏఎస్, ఐపీఎస్ లు పాలకులు చెప్పినట్లే నడుస్తారు. అందుకు గత, ఇప్పటి ప్రభుత్వాలు కూడా మినహాయింపు కాదు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఇలాంటివి తమకు మామూలేనని అధికారులు చెబుతున్నారు. అధికారులు కేవలం పాలకులు చెప్పినట్లు వినడమే వారికి ప్రభుత్వం మారడంతో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
Next Story