Mon Dec 23 2024 11:28:05 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పింఛన్లను అక్టోబరు నెల నుంచి మంజూరు చేస్తామని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పింఛన్లను అక్టోబరు నెల నుంచి మంజూరు చేస్తామని ప్రకటించింది. అర్హత ఉన్న వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపింది. కొత్త పింఛన్ల కోసం కొన్నేళ్ల నుంచి అనేక మంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త పింఛన్లను మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో సచివాలయంలోనూ, వాలంటీర్ల వద్ద దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెన్షన్లు మాత్రం మంజూరు కాలేదని చాలా మంది ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి తరుపున చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దానిని ఆచరణలోకి తీసుకువస్తున్నారు.
కొత్త పింఛన్లు...
అక్టోబరు నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అనర్హులను కూడా తొలగించేందుకు అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. చాలామంది అనర్హులు గత ప్రభుత్వంలో పింఛన్లను పొందుతున్నారని ఫిర్యాదులు అందాయి. పెన్షన్లతో పాటు వీరు అనేక రకాలైన సంక్షేమ పథకాలను పొందినట్లు గుర్తించిన ప్రభుత్వం ముందుగా అనర్హులను తొలగించాలని నిర్ణయించింది. అనర్హలు, అర్హుల జాబితాను త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమయింది. ఏవైనా అభ్యంతరాలుంటే గ్రామసభలు నిర్వహించి అందులో నిజానిజాలు తెలుసుకుంటారు.
అర్హత ఉన్నవారిని...
అయితే అర్హత ఉన్న వారు అనేక మంది పెన్షన్లకు దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒకటోతేదీనే పింఛను మంజూరు చేస్తుంది. వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది. దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు నెలకు ఇస్తుండటంతో అర్హులైన వారిని గుర్తించి వారికి న్యాయం చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. అనర్హులను జాబితా నుంచి తొలగించడంతో పాటు కొత్త వారికి, అర్హత ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశాలతో అక్టోబరు నెల నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది.
Next Story