Tue Jan 07 2025 11:36:40 GMT+0000 (Coordinated Universal Time)
Metro Rail : విశాఖకు ఓకే.. మరి బెజవాడకు వర్క్ అవుట్ అవుతుందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణాన పనులకు ఆమోదం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణాన పనులకు ఆమోదం తెలిపింది. పదకొండు వేల కోట్ల రూపాయలతో తొలిదశ ప్రాజెక్టు పనలు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం నగరం కాస్మోపాలిటన్ సిటీ. అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువే. విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజల నుంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి. జనాభా పరంగా, వచ్చి పోయే టూరిస్ట్ ల సంఖ్య ఆధారంగా అక్కడ మెట్రో రైలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ విజయవాడలో మాత్రం మెట్రో రైలు ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా? లేదా? అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, బెంగళూరుల్లో...
హైదరాబాద్ నగరంలోనే మెట్రో రైలుకు ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉందని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతుంది. హైదరాబాద్ నగరంలో కోటి మంది జనాభా ఉన్నారు. రోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చివెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ లో మెట్రో రైలు అవసరం అని గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొంత వరకూ సక్సెస్ అయిందనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ ఉండటంతో ఎక్కువ రద్దీ ఉంటుంది. అయినా మెట్రో రైలు ప్రాజెక్టు హైదరాబాద్ లో ఆశించినంత సక్సెస్ కాలేదని ఆ సంస్థ యాజమాన్యం చెబుతుంది. బెంగళూరు నగరంలోనూ మెట్రో రైలు ప్రాజెక్టు సక్సెస్ అయింది.
విశాఖ టూరిజం ప్లేస్ కావడంతో...
విశాఖపట్నంలోనూ పలు దశల్లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు. ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో పాటు కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఉండటం, వ్యాపారానికి కేంద్రంగా ఉండటంతో విశాఖలో మెట్రో రైలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలో మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. విశాఖ నగరంలో నెలకొన్న ట్రాఫిక్ కు చెక్ పడుతుందని స్థానికులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు కారిడార్లలో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. మొత్తం 76.9 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టుకు మొదటి దశలో ప్రభుత్వం ఒకే చెప్పింది.
విజయవాడలో మాత్రం...
విజయవాడలో మాత్రం ఒకింత అనుమానంగానే కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ నగరం అతి పెద్ద పల్లెటూరుగా పిలుస్తారు. దీంతో పాటు రాజధాని అమరాతి నిర్మాణం పూర్తవ్వడానికి ఎన్నేళ్లు సమయం పడుతుందో తెలియదు. సందర్శకుల సంఖ్య కూడా రోజుకు విజయవాడలో తక్కువగానే ఉంటుంది. ఎటు వెళ్లినా విజయవాడలో పది కిలోమీటర్ల దూరం మాత్రమే కావడంతో ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడతారు. బిజినెస్ పరంగా చిన్న చిన్న వ్యాపారులు విజయవాడకు తరచూ వస్తుంటారు తప్పించి టూరిజం కేంద్రంగా మాత్రం చూడరు. అందుకే ఇక్కడ మెట్రో రైలు ఎంత మేరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సందేహంగానే కనిపిస్తుంది. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరూ, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మూడు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి దశకు సంబంధించి 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయగా, మొత్తం 11,009 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. మరి సక్సెస్ అవుతుందా? లేదా? చూడాల్సి ఉంది.
Next Story