Thu Apr 03 2025 10:25:29 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చంద్రబాబు నిర్ణయం కరెక్టే.. అనర్హులను ఏరివేతకు రెడీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకాల పంపిణీలో అనర్హులను గుర్తించే పనిని ప్రారంభించింది

రాజుల సొమ్ము రాళ్ల పాలయిందనట్లు.. ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా ఆపడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఎందుకంటే ఏ పథకం అయినా అది ప్రజల సొమ్ముతోనే అమలవుతుంది. ప్రజలు చెల్లించిన పన్నుల నుంచే పథకాలకు ఏ ప్రభుత్వమైనా ఖర్చు చేస్తుంది. అందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం నిర్ణయించుకుని లబ్దిదారుల ఎంపికను చేస్తుంది. అయితే గత కొంత కాలంగా అంటే గత ప్రభుత్వ హయాంలో అనర్హులు పింఛన్లను అందుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల వారీ పింఛను ను నాలుగు వేల రూపాయలకు పెంచింది. వృద్ధులకు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను మంజూరు చేస్తూ వస్తుంది.
తలకు మించిన భారం...
అయితే కూటమి ప్రభుత్వానికి ఇది తలకు మించిన భారంగానే మారింది. అయితే పింఛనుదారుల్లో ఎక్కువ మంది అనర్హులున్నారని ఆరోపణలు రావడంతో ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో వృద్ధుల కానీ వారిని కూడా పెన్షనర్ల జాబితాలో చేర్చారు. ఇప్పటికే దీనిపై ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణాజిల్లాల్లో వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అలాగే దివ్యాంగుల్లోనూ అదే తంతు జరిగిందన్న ఆరోపణలున్నాయి. వైకల్యశాతాన్ని కూడా తప్పుగా చూపించి లబ్ది పొందే వారి శాతం కూడా ఎక్కువగా ఉందని గుర్తించారు. అందుకే ఏరివేత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ముమ్మరంగా జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల బృందం ఇచ్చే రిపోర్టు ఆధారంగానే దివ్యాంగులకు కూడా పింఛను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే అనర్హులను వేల సంఖ్యలో తొలగించినట్లు తెలిసింది.
దివ్యాంగుల్లోనే ఎక్కువ మంది...
పూర్తిగా మంచం పట్టిన దివ్యాంగులకు నెలకు పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇందులోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక సర్వే ద్వారా అనర్హులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ లో 65 లక్షల మంది వరకూ నెలకు పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రతి నెల మొదటి తారీఖును పింఛను మంజూరు చేస్తుంది. దివ్యాంగుల పేరిట దోపిడీ జరుగుతుందని భావించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రక్షాళన ప్రారంభించింది. ప్రధానంగా దివ్యాంగుల పింఛన్లలోనే పెద్ద సంఖ్యలో అవకతవకలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తూ అనర్హులను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. వేల సంఖ్యలో పింఛను దారుల తొలగింపు ఇప్పటికే పూర్తయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరి చివరకు అర్హులు ఎంతమంది మిగులుతారన్నది ఫిబ్రవరి ఒకటోతేదీన తెలియనుంది.
Next Story