Mon Dec 23 2024 12:20:57 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : గుడ్ న్యూస్...సూపర్ సిక్స్ రెడీ... ఒక్కొక్కటి అమలుకు క్యాలెండర్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేందుకు సిద్ధమయింది. వరసగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇక ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధుల విషయంలో కొంత ఆలోచన చేశారు. దీంతో అన్ని శాఖలను వరసగా సమీక్షలు చేస్తూ పరిస్థితిని అధ్యయనం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు.. ఇప్పుడు హామీల అమలు కోసం వెచ్చించాల్సిన నిధులపై ఇప్పుడు ఏపీ సర్కార్ కు ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాదు అమరావతి, పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు వాటి నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు సూపర్ సిక్స్ పై దృష్టిపెట్టారు.
దీపావళికి...
ముందుగా దీపావళికి ఉచితంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశముందని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అయినా ఇచ్చిన మాట మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మహిళలకు అందచేయనున్నారు. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక చేసే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి లబ్దిదారుల ఎంపిక పూర్తయినట్లు తెలిసింది. నిరుపేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి తొలి హామీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
డిసెంబరు నెలలో...
ఇక తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అది కూడా డిసెంబరు లేదా జనవరి నెలలో ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిసింది. ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణ, కర్ణాటకలలో అథ్యయనం చేసిన వచ్చిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందచేశారు. తెలంగాణలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఉచిత ప్రయాణానికి దాదాపు అంతే మొత్తంలో ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిధులను కూడా రెడీ చేసి పెట్టుకోవాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
జనవరి నెల నుంచి...
దీంతో పాటు ప్రధానమైన మరో హామీ తల్లికి వందనం. ప్రతి ఇంట్లో చదువుకుంటున్న వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీలో ప్రకటించారు. ఈ శాఖకు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వీలయినంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటే ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఒక్కొక్కరికీ పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తారు. ఇందుకోసం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. జనవరి నెల నుంచి ఈ పథకం అమలు కానుందని తెలిసింది.
నిరుద్యోగ భృతి కూడా...
నవంబర్ నెల బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగుల భృతికి కూడా నిధులను కేటాయించే అవకాశముంది. ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఇచ్చిన హామీని కూడా త్వరలో అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. దీని తర్వాత రైతులకు మార్చి లేదా ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఇలా వరసగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో అధికారులు నిధుల సమీకరణపై కసరత్తులు ప్రారంభించారు. మద్యం దుకాణాలు కూడా తెరవడంతో కొంత వెసులుబాటు రావడంతో పాటు కేంద్రం నుంచి కూడా కొంత నిధులు కోరడం, అప్పులు తీసుకు రావడం వంటివి చేయనున్నారు.
Next Story