Mon Dec 23 2024 02:28:50 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ ప్రజలకు "షాక్" ఇవ్వనున్న చంద్రబాబు సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపనుంది. విద్యుత్తు ఛార్జీలను నవంబరు నెల నుంచి పెంచే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపనుంది. విద్యుత్తు ఛార్జీలను నవంబరు నెల నుంచి పెంచే అవకాశముంది. పెరిగిన విద్యుత్తు ఛార్జీలు నవంబరు నెల నుంచి అమలులోకి రానున్నాయి. యూనిట్ కు 1.21 రూపాయలు పెరగనుంది. ఈ మేరకు ఈఆర్ఎసీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం కూడా విద్యుత్తు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమయింది. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం సమపాళ్లలో నడవాలంటే ఖచ్చితంగా ప్రజలపై భారం మోపక తప్పదని ప్రభుత్వం చెబుతుంది. పెరగనున్న ఈ ఛార్జీలతో ఆంధ్రప్రదేశ్ లో మరింతగా భారం ప్రజలపై పడనుంది. ఇక బల్బు వేయాలంటే భయపడిపోతారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయాలంటే జంకాల్సి వస్తుంది. ఏసీలు ఆఫ్ చేసుకోవాల్సిందే. అలా ఉంటుంది కరెంట్ బిల్లులతో అంటూ సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు మొదలయ్యాయి.
ఇచ్చిన హామీలను ...
ఇప్పటికే ఇంథన సర్దుబాటు కింద యూనిట్ కు నలభై పైసలు, 65 పైసలు చొప్పున వసూలు చేస్తున్న ప్రభుత్వం అదనంగా మరో 1.21 పైసలు యూనిట్ కు ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కూటమి ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడం ఒక్కటే మార్గం. అలాగే పెరుగుతున్న వ్యయాలను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంధన సర్దుబాటు ధరలతో కలిపితే యూనిట్ కు అదనంగా 2.26 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అంటే కరెంట్ బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. గృహ విద్యుత్తు వినియోగదారులు గగ్గోలు పెట్టే అవకాశముంది. ఇక చిరు వ్యాపారుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.
ఎన్నికలకు ముందు...
ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వాన్ని విద్యుత్తు ఛార్జీలను పెంచారంటూ.. బాదుడే.. బాదుడంటూ విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు దానిని మించి అదనపు భారం మోపడం ఏంటని విపక్షాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా వామపక్షాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల 6,072 సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేయడానికి అనుమతిస్తూ ఏపీఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక విద్యుత్తు భారం మరింతగా ప్రజలపై పడనుంది. పరిశ్రమలు, వ్యవసాయ రంగంపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ఇస్తున్న తొలి షాక్ మాత్రమేనని, రానున్న కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే మరిన్ని భారాలు వేయక తప్పదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.
Next Story