Mon Dec 23 2024 13:01:32 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas cyllenders : గుడ్ న్యూస్ ...మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఎల్లుండి నుంచే బుకింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనుంది. అయితే అర్హులైన వారు ఈనెల 29వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి బుక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. 29వ తేదీ నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందచేస్తారు. ఇందుకు ప్రభుత్వం విధివిధానాలను నిర్ణయించింది. ఒక్కసారి పథకం ప్రారంభమయిన తర్వాత అనర్హులెవరైనా ఉంటే వారు కూడా డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి టైమ్ లిమిట్ ఏమీ లేదని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 1.55 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత గ్యాస్ ను అందుకోనున్నారు.
డెలివరీ అయిన వెంటనే...
మహిళల ఉచిత గ్యాస్ పథకానికి ఇటీవల మంత్రివర్గ సమావేశం కూడా ఆమోదించింది. దీనికి సంబంధించి నిధులు కూడా 2,680 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఏడాదికి మూడు దశల్లో ఈ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే మహిళలు ఉచిత గ్యాస్ పొందాలంటే తెల్లరంగు రేషన్ కార్డును విధిగా కలిగి ఉండలి. ఆధార్ కార్డు ఉండి తీరాలి. ఏపీలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని ఉండాలి. ఎల్లుండి ఉదయం పది గంటల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. గ్యాస్ డెలివరీ వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఆయిల్ కంపెనీలు ఈ సొమ్మును తమ వినియోగదారులకు సొమ్మును తిరిగి చెల్లిస్తాయని తెలిపింది. ప్రభుత్వం నుంచి కూడా సమాచారం వెంటనే వారి సెల్ ఫోన్లకు వచ్చేలా ఏర్పాటు చేశారు. బుక్ చేసుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లోపు సిలిండర్ డెలివరీ అవుతుంది.
అర్హులైన వారందరికీ...
ఎవరూ తమకు గ్యాస్ సిలిండర్ అందలేదని నిరాశపడవద్దని తెలిపింది. అయితే ఎల్పీజీ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలని నిబంధన కూడా అమలులో ఉంది. ఆయిల్ కంపెనీలు ఏదైనా గ్యాస్ సిలిండర్ సరఫరా చేయకపోయినా, డబ్బు జమ చేయకపోయినా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. తొలి విడతలో ఈనెల 31వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ లోపు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సిలిండర్ గా నమోదవుతుంది. రెండో సిలిండర్ ను ఏప్రిల్ 1వ తేదీ నుంచి జులై 30వ తేదీ వరకూ బుక్ చేసుకోవచ్చు. మూడో విడతగా ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబరు 31వ తేదీ వరకూ బుక్ చేసుకోవచ్చు. నాల్గవ విడతగా డిసెంబరు 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకూ బుక్ చేసుకుని పొంద వచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే తమకు అందవన్న కంగారులో అందరూ ఒకేసారి బుక్ చేసుకుంటే గ్యాస్ కంపెనీలకు కూడా డెలివరీ కష్టమవుతుందని, అవసరమైన వారు మాత్రమే విడతల వారీగా బుక్ చేసుకోవాలని సూచించింది. అర్హత కలవారికి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. తమకు అందలేదని ఇబ్బందులు పడవద్దని తెలిపింది.
Next Story