Sun Mar 23 2025 07:36:05 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : లోకేశ్ కు పెరుగుతున్న గ్రాఫ్.. ఒక్కసారిగా ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు క్యాడర్ కు ఆశాజనకంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు క్యాడర్ కు ఆశాజనకంగా ఉన్నారు. లోకేశ్ తోనే సాధ్యమవతుందని క్యాడర్ బలంగా నమ్ముతుంది. చంద్రబాబు నాయుడు చట్టాలు, చట్టుబండలంటూ కాలయాపన చేస్తారని, లోకేశ్ మాత్రం గత వైసీపీ ప్రభుత్వంలో తమపై జరిగిన కక్ష సాధింపు చర్యలకు దిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే నారా లోకేశ్ వల్లనే సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. లోకేశ్ ఏడాదిన్నర పాటు యువగళం పాదయాత్ర జరిపినప్పుడు కూడా క్యాడర్ కు దగ్గరయ్యారని, వారి మనోభావాలను తెలుసుకుని వీలయినంత త్వరగానే క్యాడర్ ను తృప్తి పర్చేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మే నెలలో కడపలో జరగనున్న మహానాడులో లోకేశ్ కు కీలక బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో...
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఊళ్లను వదిలి పారిపోయారు. అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. జైళ్లకు వెళ్లి వచ్చారు. యువగళం పాదయాత్రలోనూ, తర్వాత ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ లోకేశ్ బదులుకు బదులు తీర్చుకుంటానని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ తయారవతుందని, అందులో జాబితా ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తూ క్యాడర్ ను పోలింగ్ కేంద్రాల వైపునకు వేగంగా నడపగలిగారు. లోకేశ్ వల్ల సాధ్యమవుతుందని క్యాడర్ కూడా నమ్మింది. చంద్రబాబు ఊరుకున్నప్పటికీ లోకేశ్ ఊరుకోరని, తమను వేధించేవారిని వరసగా జైలుకు పంపేందుకు నారా లోకేశ్ వెనుకాడరని క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చంద్రబాబు మాత్రం...
చంద్రబాబు నాయుడు ఒకింత ఆలోచన చేస్తారు. రాజకీయంగానే కాకుండా ఆయన ప్రతీకారం వంటి వాటికంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. చంద్రబాబు నాయుడును కూడా గత ప్రభుత్వం వదల్లేదని, అలాంటి వారిని కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా చంద్రబాబుకు యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అదే లోకేశ్ విషయానికి వచ్చే సరికి లోకేశ్ ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారంటూ నమ్ముతున్నారు. అందుకే క్యాడర్ లో రోజురోజుకూ లోకేశ్ కు ఇమేజ్ మరింత పెరుగుతుంది. చంద్రబాబుకు కూడా కావల్సింది అదే కావడంతో టీడీపీ క్యాడర్ లో మరింత ఉత్సాహం కనపడుతుంది.
Next Story