Tue Jan 07 2025 18:11:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అవసరంలేకున్నారేషన్ బియ్యం తీసుకుంటున్నారా? ఏపీలో ఇదొక ట్రెండ్
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యాన్ని వినియోగించకపోయినా సరే వాటిని తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యాన్ని వినియోగించకపోయినా సరే వాటిని తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. తీసుకున్న బియ్యాన్నిఎక్కువ ధరకు విక్రయించే అవకాశముండటం, వ్యాపారులు కూడా కాచుక్కూర్చుని ఉండటంతో రేషన్ బియ్యం తమ అవసరానికి మించి తీసుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని సాధారణంగా తీసుకుంటే దోసెల కోసం వినియోగిస్తారు. అదే సమయంలో వాటిని అన్నంగా ఎక్కువ మంది వినియోగించరు. నాసిరకం బియ్యమని భావించి ఎక్కువ మంది వాటిని ఆహారంగా తీసుకోరు. అయితే రేషన్ బియ్యానికి బయట మార్కెట్ లో ఉన్న డిమాండ్ తో తమకు అవసరం లేకపోయినా దుకాణాల నుంచి తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
పక్కదారి పట్టడానికి...
రేషన్ బియ్యం పక్క దారి పట్టడానికి కూడా ఇదొక కారణమని అధికారులు భావిస్తున్నారు. కొందరు రేషన్ షాపుల యజమానులకే ఎంతో కొంతకు విక్రయిస్తున్న ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. పలుమార్లు జరిగిన దాడుల్లో ఇది స్పష్టమయింది. దీంతో పాటు ఏపీలో కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం పెద్దయెత్తున ఎగుమతులు అవుతుండటంతో దీనిపై చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేషన్ బియ్యం పంపిణీలో లోటు పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలసింది. కాకినాడ పోర్టు నుంచి పెద్దయెత్తున రేషన్ బియ్యం ఎగుమతి అవ్వడానికి గల కారణాలపై కూడా అనేక రకాలవిశ్లేషణలు వెలువడుతున్నాయి.
బయట మార్కెట్ లో విక్రయిస్తుంటే...
నిజానికి రేషన్ బియ్యం తీసుకునేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలు కూడా రేషన్ బియ్యాన్ని చీప్ గా చూస్తున్నారు. అయితే రేషన్ బియ్యం తీసుకోకుంటే తెలుపు రంగు కార్డు రద్దవుతుందని భావించి రేషన్ బియ్యాన్ని నెలవారీగా తమకు అవసరం లేకపోయినా తీసుకుంటున్నారని అధికారుల దర్యాప్తులో వెల్లడయింది. తెలుపు రంగు కార్డు ఉంటే అనేక రకాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఆరోగ్య శ్రీ వంటి సేవలు కూడా లభిస్తాయి. అందుకే తెలుపు రంగు రేషన్ కార్డు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ తలుపు రంగు రేషన్ కార్డు ఉన్న వారు మాత్రం రేషన్ బియ్యాన్ని తీసుకుని బయట విక్రయించడం వల్లనే పెద్దయెత్తున ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తెలుపు రంగు కార్డు కోసం...
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తెలుపు రంగు రేషన్ కార్డులు 1.48 కోట్లు వరకూ ఉన్నాయి. రాష్ట్రంలోని 1.68 కోట్ల కుటుంబాలు రేషన్ బియ్యాన్ని నెలనెలా అందుకుంటున్నాయి. రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, పామాయిల్ వంటివి కూడా తీసుకుంటున్నారు. అయితే అదే సమయంలో కందిపప్పు, పంచదార వంటి వాటిని వినియోగిస్తున్నా, బియ్యాన్ని మాత్రం బయట మార్కెట్ లో విక్రయిస్తుండటం కారణంగానే పెద్దయెత్తున స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తెలుపు రంగు రేషన్ కార్డుల కోసం కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తమకు ఆ కార్డు వస్తే చాలు పథకాలు అందుతాయని భావించి రేషన్ కార్డులు ఎగబడుతున్నారు. మొత్తం మీద రేషన్ బియ్యంపై ఏపీ సర్కార్ పోస్టుమార్టం ప్రారంభమయింది.
Next Story