Mon Dec 23 2024 06:45:01 GMT+0000 (Coordinated Universal Time)
45 రోజుల్లో 4 కోట్లు సంపాదించిన రైతు కథ తెలుసా?
వ్యవసాయాన్ని తక్కువ చేసి చూసే వాళ్లకు ఈ రైతు కథ చెంపపెట్టు లాంటిది. వ్యవసాయం చేస్తే ఏమి సాధిస్తారు.. అప్పులు తప్పా ఇక ఏమీ ఉండవు అని చెప్పే వారికి ఈ రైతు కథ ఒక కనువిప్పు. ప్రస్తుతం టమాటా పంటకు ఎంత గిరాకీ ఉందో తెలిసిందే..! ఈ పంటను నమ్ముకున్న వాళ్ల జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎంతో మంది రైతులు టమాటా పంట కారణంగా అప్పుల నుండి బయటపడ్డామని చెబుతూ ఉండడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు 45 రోజుల్లోనే రూ.4 కోట్లు సంపాదించాడు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మురళి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. మదనపల్లెలోని టమాటా మార్కెట్లోనే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా టమాటాలు ఎక్కువ ధర పలుకడంతో వాటిని విక్రయించి బాగా సంపాదించుకున్నారు.
మురళి దంపతులు ఏప్రిల్‌లో కరకమండ్ల గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమాటా సాగు చేశారు. గత 45 రోజులలో, వారు 40,000 టమాట బాక్సులను విక్రయించారు. పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో గతంలో చేసిన రూ.1.5 కోట్ల అప్పులు తీర్చగలిగామని రైతు తెలిపారు. విద్యుత్ సరఫరా బాగుండడంతో ఈసారి దిగుబడి బాగా వచ్చిందని.. టమాటా ధరలు బాగా పెరగడం కూడా తమకు కలిసివచ్చిందని 48 సంవత్సరాల మురళి తెలిపారు. టమాటా ఇంత భారీగా ఆదాయాన్ని ఇస్తుందని నేనెప్పుడూ ఊహించలేదని మురళి అన్నారు. లాభంలో కొంత భాగాన్ని ఇంకొన్ని పంటలకు, పెట్టుబడి కోసం ఉంచాలని అనుకుంటున్నారు.
తెలంగాణలోని మెదక్ జిల్లాలో కూడా ఒక రైతు కోటీశ్వరుడు అయ్యాడు. గత నెల రోజులుగా టమోటాలు అమ్మడం ద్వారా రూ. 2 కోట్లు సంపాదించాడు, కోటి రూపాయల విలువైన మరో పంట కోతకు సిద్ధంగా ఉంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి టమాట ధరకు రెక్కలు రావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మార్కెట్లో టమాట ధర కిలో రూ.150కి పెరగడం, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సరిపడా సరఫరా లేకపోవడంతో మహిపాల్‌రెడ్డి హైదరాబాద్ మార్కెట్లో మంచి ధరకు అమ్ముకున్నాడు. హోల్‌సేల్ మార్కెట్లో కిలో రూ.100కు విక్రయించి కోట్లు సంపాదించాడు.
Next Story