Mon Dec 23 2024 05:52:44 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ వచ్చాయి
శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం నాడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 4, మంచిర్యాల జిల్లా భీమినిలో 3.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడవ్వడంతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గాలులు పెద్దఎత్తున వీస్తున్నాయి. ఈ ప్రభావంతో ఇవాళ కోస్తా, ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బాపట్ల, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయి.
Next Story