Tue Nov 05 2024 10:50:54 GMT+0000 (Coordinated Universal Time)
Vangalapudi Anitha : పాపం అనిత.. పదవికి ఢోకా లేకపోయినా?
వంగలపూడి అనిత హోం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత వరకూ యాక్టివ్ గానే ఉన్నారు
హోంమంత్రి పదవి అంటే నిజంగా కత్తిమీద సాము వంటిది. ఎవరికైనా అంతే. ఆపదవిలో ఉన్నవారికి ఏ పార్టీలో అధికారంలో ఉన్నప్పటికీ పెద్దగా పవర్స్ ఉండవు. హోంమంత్రి అంటే కేవలం విమర్శలు చేయించుకోవడానికే ఆ పదవి చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు కీలక నేతలు హోంశాఖను హ్యాండిల్ చేస్తారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఇద్దరు మహిళ హోంమంత్రులు పనిచేశారు. మేకతోటి సుచరిత కొన్నాళ్ల పాటు హోంమంత్రిగా పనిచేయగా, తానేటి వనిత ఇంకొన్నాళ్లు పనిచేశారు. కానీ ఇద్దరు కేవలం సంతకం చేయడానికి మాత్రమే ఆ సీట్లో కూర్చునే వారు. ముఖ్య నిర్ణయాలన్నీ నాటి సీఎంవో నుంచి వచ్చేవంటారు.
యాక్టివ్ గానే ఉన్నా...
నిజానికి వంగలపూడి అనిత హోం మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత వరకూ యాక్టివ్ గానే ఉన్నారు. అనితకు పూర్తి స్థాయి అధికారాలు ఉండవని అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ కు కూడా తెలియంది కాదు. ప్రధానమైన పోస్టింగ్ ల విషయంలో హోంమంత్రి ప్రమేయం తక్కువగానే ఉంటుంది. సాంకేతికంగానే ఎవరున్నా పదవిలో ఉంటారు తప్పించి..ఆ శాఖలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి తీసుకుంటుంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానమైనది కనుక ముఖ్యమంత్రి నిరంత పర్యవేక్షణలోనే హోంశాఖ ఉంటుంది. డీజీపీ స్థాయి అధికారులు కూడా ఏదైనా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాతనే తీసుకుంటారన్నది కాదనలేని వాస్తవం.
విమర్శలకు మాత్రం...
కానీ విమర్శలకు వచ్చేసరికి హోంమంత్రి బలయిపోతుంటారు. ఇప్పుడు వంగలపూడి అనిత కూడా. నిజానికి గత కొద్దిరోజుల నుంచి ఏపీలో శాంతిభద్రతల సమస్యకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, కొన్ని చోట్ల మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పిఠాపురంలోనూ ఒక యువతిపై అత్యాచారం జరిగింది. ఆ కేసులో నిందితుడిపై సరైన చర్యలు తీసుకోలేదన్నది పవన్ కల్యాణ్ ఆగ్రహంగా తెలుస్తోంది. దానికి హోంశాఖను బాధ్యులను చేస్తూ ఆయన మాట్లాడారు. హోంమంత్రి పనితీరును తప్పుపట్టే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. కానీ హోం మంత్రి ఏ విషయంలోనూ ఏ నిర్ణయంలోనూ పెద్దగా ప్రమేయం ఉండదన్న విషయం పవన్ కల్యాణ్ కు తెలియంది కాదు.
పదవీ గండం అనేది...
కానీ పైవారిని అనలేక.. పవన్ కల్యాణ్ వంగలపూడి అనితపై ఆయన నేరుగా వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆమెకు వెనువెంటనే పదవీ గండం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే టీడీపీ నుంచి ఆమె గెలిచి చంద్రబాబు ఇచ్చిన పదవి కావడంతో ముఖ్యమంత్రికి అన్ని విషయాలు తెలుసు. వంగలపూడి అనిత తప్పు ఏమీ లేదని కూడా తెలుసు. అందుకే అనిత పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా.. ఆమె తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విపక్ష నేతలకు కూడా హోం మంత్రిత్వ శాఖపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీ చివరకు ప్రభుత్వంపై బురద జల్లాలంటే ఈ శాఖ ఒక్కటే కనిపిస్తుంది. అందుకే హోంశాఖ ఎంత వపర్ ఫుల్ అయినదో.. అంత చికాకు తెప్పించే శాఖ అని అనితకు ఇప్పుడు అర్థమయి ఉండాలి.
Next Story