Mon Dec 23 2024 23:54:32 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రిటర్న్ గిఫ్ట్ తప్పదు బాసూ... ఆరంభంలోనే ఇలా ఆడిపోసుకుంటే ఎలా సామీ?
నెల్లూరులో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు విన్న వారికి ఎవరికైనా గత ఐదేళ్లలో జరిగిన ఘటనలు గుర్తుకు రాకమానవు
నెల్లూరులో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు విన్న వారికి ఎవరికైనా గత ఐదేళ్లలో జరిగిన ఘటనలు గుర్తుకు రాకమానవు. ఐదేళ్లలో టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టారో గుర్తు చేసుకోమంటున్నారు టీడీపీ నేతలు. కేవలం టీడీపీ నేతల మీదనే కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని కూడా వదలకుండా సీఐడీ పోలీసులు వెంట పడి మరీ టార్చర్ పెట్టిన విషయాన్ని జ్ఞప్తి చేస్తున్నారు. గత ఐదేళ్లు నువ్వు చేసిన పనినే ఇప్పుడు జరుగుతుందని, అందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా అంటున్నారు. ఎందుకంటే రెడ్ బుక్ విషయాన్ని పక్కన పెడితే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంలో తప్పు ఇప్పుడు కనిపిస్తుందా? జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు ఒక్కమాట కూడా మాట్లాడని జగన్ ఇప్పుడు ఎందుకు ఆడిపోసుకుంటున్నారంటున్నారు
అక్రమ కేసులు పెట్టి...
అచ్చెన్నాయుడును ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి హడావిడి చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఈ బాధ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కొల్లు రవీంద్రపై హత్యా యత్నం కేసు పెట్టి రాజమండ్రి జైలుకు తరలించిన విషయాన్ని మర్చిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు. బీసీ జనార్ధన్ రెడ్డిని జిల్లా మార్చి జైలుకు పంపిన విషయాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. వాళ్లందరికీ ఈరోజు మంత్రి పదవులకు రావడానికి ఆ కేసులే కారణం కాదా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేస్తే కనీసం ఒక్కరిపై కేసు నమోదు చేయకపోవడాన్ని కూడా జగన్ మరిచిపోతే ఎలా అని నిలదీస్తున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి...
ిఇవన్నీ అటు ఉంచితే ఏడు పదులు దాటిన వయసులోనూ చంద్రబాబు నాయుడును నంద్యాలలో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో యాభై రెండు రోజుల పాటు ఉంచిన మాటేంటి జగనూ అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అధికారం పోగానే బాధ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అక్రమ కేసులు పెట్టామని ఆరోపణలు చేస్తున్న జగన్ టీడీపీ నేతలు ఎందరిపై కేసులు పెట్టారో ఒక పుస్తకం కూడా సరిపోదని చెబుతున్నారు. నాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టిన విషయాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ను అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పుడు ఈ పెయిన్ తెలిసి రాలేదా? అని ప్రశ్నించారు.
దెయ్యాలు వేదాలు...
జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీనేతలు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షలు వేస్తారని, చట్టాన్ని అతిక్రమిస్తే న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ముందుంది అసలు పండగ అంటూ కొన్ని పోస్టులు కనపడుతున్నాయి. రానున్న కాలంలో జైళ్లకు తిరగాల్సిందేనని, వరసగా పరామర్శలకు పరిమితం కావాల్సిందేనని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అందుకే అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా వ్యవహరింకూడదన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని, ఎవరైనా పాత రోజులు గుర్తుకు తెచ్చుకుని మనగలిగితే బెటర్ అని సూచిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా, పార్టీని బలోపేతం పై ఫోకస్ పెట్టమంటూ మరికొందరు హితవు పలుకుతున్నారు.
Next Story