Sat Nov 23 2024 01:27:45 GMT+0000 (Coordinated Universal Time)
95 శాతం హామీలను అమలు చేశాం
ఈ మూడేళ్ల కాలంలో 95 శాతం హామీలను అమలు చేశామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. అనంతరం జగన్ పరేడ్ ప్రదర్శనను ఆసక్తిగా గమనించారు. మొత్తం 12 కంటెంజెంట్స్ పరేడ్ ను నిర్వహించారు. ప్రభుత్వ పథకాలతో రూపొందించిన వివిధ శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఎన్నికల హామీలను అమలుపర్చకపోవడం ద్వారా ప్రజలకు కొన్ని పార్టీలు అన్యాయం చేశారన్నారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా కొందరికి భజన చేస్తుందని స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నడైనా ఊహించారా? అని జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రాలను పెంచామని తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో 95 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు.
అనేక సంస్కరణలు...
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో అనేక పాలన సంస్కరణలను తీసుకు వచ్చామని చెప్పారు. ఒకటో తేదీనే అందరికి పింఛన్లను ఇంటివద్దనే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అన్ని ఇంటికే చేరవేస్తున్నామని చెప్పారు. పౌర సేవల్లో మార్పులు తీసుకు వచ్చామని తెలిపారు. విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు అండగా నిలిచామని తెలిపారు. చాలా వరకూ మూడేళ్లలోనే చేశామని తెలిపారు. విద్య వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. అందరికీ పక్కా ఇళ్లు నిర్మాణం చేసి ఇస్తున్నామని చెప్పారు. ప్రజలను ఆదుకునేందుకు మనసు పెట్టి మూడేళ్లలోనే మార్పును తీసుకు వచ్చామని జగన్ తెలిపారు. రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్లు వెచ్చించామని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సామాజిక న్యాయాన్ని అమలు పర్చామని తెలిపారు.
సామాజిక న్యాయం....
విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని చెప్పారు. మూడేళ్లలో విద్యారంగంపై 53 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అందరికీ ఆరోగ్యం అందించే లక్ష్యంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేసేలా ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి కల్పిస్తున్నామని చెప్పారు. 1.84 లక్షల శాశ్వత ఉద్యోగాలను మూడేళ్లలో కల్పించామని జగన్ తెలిపారు. ఇరవై వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, నాలుగు లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉపాధి కల్పించామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వారికి అన్ని అవకాశాలు కల్పించామని తెలిపారు. 13 జిల్లా పరిషత్ లో ఛైర్మన్ పదవులను తొమ్మది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించామన్నారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Next Story