Mon Nov 18 2024 14:56:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సర్కార్ కు రిలీఫ్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అమరావతి భూ కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం. ఆర్. షా ధర్మాసనం తీర్పు చెప్పింది. సిట్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుగా అన్వయించుకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను విచారించొద్దని చెబితే ఎలా అని ప్రశ్నించింది.
విచారణను అడ్డుకుంటే ఎలా?
ప్రాధమిక దశలోనే విచారణను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పుతో అమరావతి రాజధాని భూమి కుంభకోణం వ్యవహారాలపై సిట్ ఇక విచారణ జరిపేందుకు వీలు కలుగుతుంది. వేలాది ఎకరాలు తమకు అనుకూలురైన వారికి గత ప్రభుత్వ నేతలు కట్టబెట్టారని, ముందుగానే రాజధాని నిర్ణయించుకుని భూములను తక్కువ ధరకు సొంతం చేసుకోవడంతో పాటు అసైన్ మెంట్ ల్యాండ్ లను కూడా నియమ నిబంధనలకు విరుద్ధంగా కొందరు కొనుగోలు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కొంత ఊరట లభించినట్లయింది.
Next Story