Mon Dec 23 2024 13:12:18 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ.. ఢిల్లీకి సీఎం జగన్
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉందని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. జులై 4న విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు అక్కడే బస చేసి 5న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను జగన్ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీకి రావాల్సిన నిధుల గురించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల బీజేపీ నాయకులు ఏపీలో పర్యటించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. అయితే వైసీపీ నుండి ఊహించని ఎదురుదాడి అయితే జరగలేదని అంటున్నారు. సీఎం జగన్ కూడా బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీన్ని బట్టి సీఎం జగన్ మోదీ ప్రభుత్వంతో దోస్తానాను కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
రాష్ట్ర విభజనలో భాగంగా ప్రత్యేకంగా రావాల్సిన అన్ని నిధులను, ప్రత్యేక హోదాను, పెండింగ్ లో ఉన్న కొన్ని నిధులను గురించి చర్చించనున్నారు. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్డీయేయేతర పార్టీలు కూటమిగా ఏర్పడుతున్న సమయంలో ఎన్డీయేను విస్తరించేందుకు బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబుతో జేపీ నడ్డా, అమిత్ షాలు భేటీ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఎన్డీయే విస్తరణలో భాగంగా ఏపీలో టీడీపీతో కాకుండా వైసీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైందా అనే వాదన కూడా నడుస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సాధారణ భేటీలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షాతో జగన్ భేటీ అవుతున్నారని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. వేచి చూద్దాం.. ఏమి జరుగుతుందో త్వరలోనే త్వరలోనే మానకూ క్లారిటీ వస్తుందని ఇతర పార్టీల నేతలు కూడా అనుకుంటూ ఉన్నారు.
Next Story