మాజీ మంత్రి నారాయణ అరెస్టులో హైడ్రామా.. ఏ1గా చంద్రబాబు.. సంచలనం
మాజీ మంత్రి నారాయణ అరెస్టు మలుపులు తిరుగుతోంది. అరెస్టు చేసిన కొద్దిసేపటికే మరో కేసు వెలుగులోకి వచ్చింది.
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్టులో హైడ్రామా కొనసాగుతోంది. ఈరోజు ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐకియా షోరూం వద్ద కారులో వెళ్తుండగా నారాయణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ఒక టీం సీఐడీ అధికారులు వెళ్లినట్లు సమాచారం.
ఏపీలో సంచలనం రేపిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల అధినేతను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రిని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు.. అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఆయన్ను చిత్తూరు తరలించేందుకు ఇరురాష్ట్రాల పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. అధికారిక ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం నారాయణను చిత్తూరు తరలించనున్నారు.
అయితే ఆయన్ను మరో కేసులో అరెస్టు చేసినట్లు దుమారం రేగింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో ఆయన్ను అరెస్టు చేశారని చెబుతున్నప్పటికీ.. అమరావతి భూములకు సంబంధించిన కేసులో అరెస్టయినట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఏ1గా చంద్రబాబు నాయుడు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్, ఇంకా లింగమనేని కంపెనీలు, పలువురు అధికారులను నిందితులుగా చేర్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆర్టీరియర్ రోడ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా లబ్ధి పొందారని.. రోడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి.
మాజీ మంత్రి నారాయణను లీకేజీ పేపర్ల కేసులో అరెస్టు చేసిన వెంటనే మరో కేసు వ్యవహారం బయటికి రావడం సంచలనంగా మారింది. అటు లీకేజీ కేసు.. ఇటు అమరావతిలో అక్రమాల కేసుతో ఒక్కసారిగా హీట్ రాజుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా కేసు నమోదు కావడం ఉత్కంఠ రేపుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రతీకార్య చర్య అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. జగన్ తన అసమర్థ పాలన నుంచి డైవర్ట్ చేసేందుకు అరెస్టుల పర్వం సాగిస్తున్నారని తప్పుబడుతున్నారు.
అదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం వైఎస్ జగన్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన కొద్దిసేపటి కిందట సీఎంతో సమావేశమై చర్చించారు. బయటకు వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేపర్ల లీకేజీ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని.. పోలీసులు విచారణ జరిపి నారాయణను అరెస్టు చేశారని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు అరెస్టు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. కేసు విషయాలను పోలీసులు వెల్లడిస్తారని చెప్పారు.